కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్: పార్టీలు, జెండాలు పక్కన పెట్టాలంటూ ఓటర్లకు పిలుపు
హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యమని అన్నారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజిన్ తోనే సాధ్యమని అన్నారు. ముస్లిం ఓట్ల కోసం మతపెద్దలంతా ప్రయత్నిస్తున్నారని.. సాధు సంతువులు, అర్చక సమాజమంతా బయటకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
'రాజకీయ పార్టీలు పక్కన పెడదాం.. రంగు రంగు జెండాలు పక్కన పెడదాం.. కాషాయపు జెండా పట్టుకొని ఈ తెలంగాణలో ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం ఒక్కటిగా కలిసి ఇక్కడ ఉన్న రజాకారులను భూస్థాపితం చేద్దాం. లేకుంటే రామరాజ్యం ఏర్పడదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఆవేశంతో మాట్లాడటం లేదు.. ఈ గడ్డ కోసం ఆవేదన చెంది మాట్లాడుతున్నాను' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విజయ శంఖారావం కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బిచ్కుందకు చేరుకున్న ఆయన.. అక్కడ్నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా మండలంలోని పత్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బిచ్కుంద బస్టాండ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు.
జుక్కల్ ను చూస్తే దు:ఖమొస్తోందని.. ఇన్నాళ్ల అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో మగ్గిపోయిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలారా.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలు, ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు మన బ్రతుకులు మారాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ లెక్క బీజేపీ కుటుంబ పార్టీ కాదు.. కాంగ్రెస్ లెక్క అర డజను సీఎంల పార్టీ కాదు.. క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎన్నికైన ఎమ్మెల్యేలు, జాతీయ నాయకత్వం కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు' అని బండి సంజయ్ చెప్పారు. నరేంద్ర మోడీ సుపరిపాలనలో యావత్తు భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిందని.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రాష్ట్రంలో ఉంటేనే న్యాయం జరుగుతుందని సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications