కేసీఆర్ మాటలతో వినడు.. కొట్లాడితేనే వింటాడు; ఇక బాంచన్ బతుకులు వద్దు: బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 19వ రోజు కొనసాగుతోంది. ధన్వాడ మండలం మణిపూర్ తండాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఆయనను 300 మంది ఉపాధిహామీ కూలీలు కలిసి తన గోడు చెప్పుకున్నారు. ఉపాధి హామీ కూలీలో భాగంగా తమకు ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదని బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లిన ఉపాధి హామీ కూలీలకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
బండి సంజయ్ కు తమ గోడు చెప్పుకున్న ఉపాధి హామీ కూలీలు
ఉపాధిహామీ కూలీలు తాము పులులు ఉన్న గుట్టలలో పనికోసం వెళుతున్నామని, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నామని, ప్రస్తుతం రోజువారి కూలి 257 + 20 రూపాయలు ఇస్తున్నారు అంటూ బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఆ కూలీ ఏ మాత్రం సరిపోవడం లేదని మరో రెండు వందల యాభై రూపాయలు అయినా అదనంగా పెంచాలని కోరుతున్నామని బండి సంజయ్ తో పేర్కొన్నారు. గత మూడు నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం తమకు కూలీ డబ్బులు ఇవ్వడం లేదని, తమకు ధన్వాడ లో పని దొరకడం లేదని ఉపాధి హామీ కూలీలు బండి సంజయ్ కు తెలిపారు. దీంతో ఉపాధిహామీ కూలీల బాధలు ఉన్న బండి సంజయ్ వారికి తాను అండగా ఉంటానని వెల్లడించారు.

ఉపాధిహామీ కూలీల సొమ్ము తినే వాళ్లందరి లెక్కలు తేలుస్తా: బండి సంజయ్
ఇక ఉపాధిహామీ కూలీలతో కలిసి కూర్చుని వారి సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్ కేంద్రం విడుదల చేసిన నిధులు అందరికీ అందేలా కృషి చేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఉపాధిహామీ కూలీల సొమ్ము తినే వాళ్లందరి లెక్కలు తేలుస్తా అని పేర్కొన్నారు బండి సంజయ్. ఉపాధి హామీ నిధులను కెసీఆర్ ఆపుతున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీల బకాయిలను ఇప్పిస్తానని పేర్కొన్న బండి సంజయ్, అదనంగా 50 రోజులు ఉపాధి హామీ పని దినాలు పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు.
కేసీఆర్ మాటలతో వినడు .. కొట్లాడితేనే వింటాడు
కేసీఆర్ మాటలతో వినడని, కొట్లాడితేనే వింటారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇకనుండి వారానికి ఒకసారి కూలీ డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎండాకాలం ఉపాధి హామీ కూలి కి అదనంగా 20 రూపాయలు కేంద్రం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉపాధి హామీ నిధులను ఆపడం లేదని పేర్కొన్న బండి సంజయ్ ఇదంతా కెసిఆర్ పనే అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నమ్మించి గొంతు కోయడం లో కెసిఆర్ దిట్ట అని మండిపడిన బండి సంజయ్, ప్రధాని మోడీ ఇస్తున్న పైసలు ఉపాధి హామీ కూలీలకు చేరే విధంగా చేస్తామని, ఇక బాంచన్ బతుకులు వద్దు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

మొత్తం లెక్క తేల్చి కూలీలను మోసం చేసిన వారిని జైలుకు పంపిస్తా
మొత్తం లెక్కలు తెప్పించి, మీకు అన్యాయం చేసిన వాళ్ళ లెక్క చూస్తానని, వాళ్ళ పై కేసులుపెట్టించి జైలుకు పంపిస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుపేదలైన ప్రజల కోసం లక్షల 40 వేల ఇళ్లు మంజూరు చేశారని, అయినా కెసిఆర్ రాష్ట్రంలో ఎక్కడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని, పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే గల్లా పట్టి నిలదీయండి అంటూ మండిపడ్డారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి వచ్చామని, సీఎం కెసిఆర్ ఎన్నికల ఉన్న సమయంలో ఓట్ల కోసం మాత్రమే వస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications