బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత: నల్గొండ జిల్లాలో అడ్డుకునే యత్నం చేసిన టీఆర్ఎస్, బీజేపీ ధర్నా!!
బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాపర్యటన నేపథ్యంలో నల్గొండ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన తన పర్యటన కొనసాగించారు.బండి సంజయ్ పర్యటన క్రమంలో, బీజేపీ శ్రేణులు భారీగా ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా అక్కడకు చేరుకున్నాయి.
నల్లజెండాలతో బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బండి సంజయ్ పర్యటనలకో ఉద్రిక్తత .. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
పరిస్థితిని అదుపు చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ళు, కోడిగుడ్లు విసిరారు. బీజేపీ నాయకులు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐకేపీ సెంటర్ దగ్గరకు స్వయంగా డీఐజీ రంగనాథ్ బందోబస్తును పరిశీలిస్తున్నారు.

అర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద బండి సంజయ్.. వాహనంపై కోడిగుడ్లు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు, బీజేపీ ధర్నా
ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోలు విషయంపై అర్జాల బావి ఐకెపి సెంటర్ ను సందర్శించిన బండి సంజయ్ అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు భరోసా ఇచ్చారు. యాసంగి వడ్లను కూడా కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
మరోవైపు పోలీసులు బండి సంజయ్ పర్యటనను డ్రోన్ కదలికల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అర్జాల బావి ఐకెపి సెంటర్ పర్యటన ముగించుకుని వెళ్తున్న బండి సంజయ్ వాహనాలపై టీఆర్ ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీంతో బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు.
సోమ , మంగళవారాలలో నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన
ఆర్జాల బావి పర్యటన తర్వాత బండి సంజయ్, మిర్యాలగూడ నేరేడుచర్ల గడిపల్లి ప్రాంతాలలో రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. సోమవారం రాత్రి సూర్యాపేట లోనే బస చేసి, మంగళవారం రోజు కూడా నల్గొండ జిల్లాలో పర్యటనను కొనసాగించనున్నారు మంగళవారం రోజు తిరుమలగిరి తుంగతుర్తి దేవరుప్పుల జనగామ మండలాలలో బండి సంజయ్ పర్యటన కొనసాగనుంది కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందులను, మార్కెట్ లో ధాన్యం అమ్మకానికి తీసుకువచ్చి కొనుగోలు చేయకుంటే రైతులు పడుతున్న బాధలను స్వయంగా రైతులతో మాట్లాడి బండి సంజయ్ తెలుసుకోనున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతుల ధాన్యం కొనుగోలు చేసేలా బిజెపి సాగిస్తున్న యుద్ధంలో భాగంగా బండి సంజయ్ పర్యటన కొనసాగుతోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు కోసం బీజేపీ సమరం
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య దుమారంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని, కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని బిజెపి తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు బిజెపి సిద్ధమైంది. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ, మంగళ వారాల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో పర్యటించి, ఐకెపి సెంటర్లో వద్ద రైతుల బాధలను తెలుసుకొని రైతన్నకు మద్దతుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications