బండి సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత... ఘాటుగా ట్వీట్లతో రచ్చ!!
మొన్న నిజామాబాద్ లో ఒక కార్యక్రమంలో నవ్వుకుంటూ పలకరించుకున్న, మాట్లాడుకున్న బండి సంజయ్, ఎమ్మెల్సీ కవితలు తాజాగా ట్విట్టర్ వేదికగా వార్ కు దిగారు. రాజకీయాల్లో పలకరించుకోవటాలు, అంతలోనే ఘాటుగా తిట్టుకోవటాలు మామూలే అని తాజాగా వీరిద్దరి ఘాటు ట్వీట్ లతో అర్ధం అవుతుంది.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ కు ఆమె ప్రతిగా రివర్స్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ ఏకరువు పెడితే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్సీ కవిత టార్గెట్ చేశారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమీ లేదని ఒకరినొకరు టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

బండి సంజయ్ ట్విట్టర్లో చేసిన ట్వీట్లో గవర్నర్ కు గౌరవం దక్కదు. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరి. బతుకమ్మను అవమానించిన వాడి తో ఆలింగనం. ఇంటి బిడ్డ కు మాత్రం బలగంతో నిలబడతావ్ అడ్డం. అదిరింది కెసిఆర్ నీ మహిళా సంక్షేమం అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చెప్పి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న సంక్షేమ దినోత్సవాన్ని టార్గెట్ చేశారు.
ఇక బండి సంజయ్ చేసిన ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళకు గౌరవం దక్కదు. మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీ పై చర్యలుండవు. నినాదాలకు బేటీ బచావో బేటీ పడావో పరిమితమైంది.
సిలిండర్ ధరలు పెంచి మహిళలకు కిచెన్లో కన్నీళ్లు తెప్పిస్తున్నారు. మహిళల విద్య, వైద్యం పై నిర్లక్ష్యం, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధి ముఖ్యం. ఆడబిడ్డ తలచుకుంటే మీ అడ్రస్ గల్లంతు అవుతుంది అంటూ బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఏది ఏమైనా బండి సంజయ్, కవితల మధ్య తాజా ట్విట్టర్ వార్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications