బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి : కేసీఆర్ పై యుద్ధం; పోటాపోటీగా పాదయాత్రల వెనుక మరో సీక్రెట్ !!
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడబోతున్నాయా? బండి సంజయ్ సారథ్యంలో దూకుడు చూపిస్తున్న బిజెపి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో దూకుడుగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడానికి రంగంలోకి దిగుతున్నాయా ? టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని టార్గెట్ చేసి ప్రజాక్షేత్రంలో బలహీనం చేసి, తమ బలాన్ని పెంచుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ లు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయా? అటు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు అదేనా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

కేసీఆర్ పై సమరానికి బండి సంజయ్ రెడీ ..
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తుంది. బండి సంజయ్ సారధ్యంలో దుబ్బాక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ ముందు వరుసలో నిలిచింది. ఇప్పుడు మరోమారు హుజురాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి మరోమారు సీఎం కేసీఆర్ పై యుద్ధానికి సిద్ధమైంది.

పాదయాత్రతో రంగంలోకి బండి సంజయ్ .. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పే యత్నం
ఇదే సమయంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యామ్నాయం బిజెపినే అని స్పష్టంగా చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. బండి సంజయ్ ఆగస్టు 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు ఐదు విడతలుగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టి రానున్నారు. దీని కోసం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి మొదటి విడత పాదయాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉండనుంది.

పాదయాత్ర చెయ్యాలనుకుంటున్న రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ లో కొత్త జోష్
ఈ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపటంతో పాటు రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టేందుకే ఇప్పటి నుండి బండి సంజయ్ రంగంలోకి దిగనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కెసిఆర్ ధీటుగా తట్టుకునే బలమైన ప్రతిపక్షం బిజెపి అని చెప్పాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జులై సెకండ్ వీక్ నుండి పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

కేసీఆర్ డీ కొట్టేది మేమే అని చెప్పే ప్లాన్
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కెసిఆర్ ను ఎండగట్టడం సరైన మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా ప్రకటించిన నాటి నుండి దూకుడు మీదున్న రేవంత్ కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అని చెప్పాలని, కెసిఆర్ తో పాటుగా బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
Recommended Video

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ .. మధ్యలో టీఆర్ఎస్ .. రసవత్తర సమరం
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ప్రజాక్షేత్రంలో బలం పెంపొందించుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ లు రంగంలోకి దిగనున్నాయి. పార్టీల రథసారథులు పాదయాత్ర చేపట్టి సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టాలని, తామే ప్రత్యామ్నాయమని చెప్పాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల తీరుతో అధికార టీఆర్ఎస్, కేసీఆర్ కూడా ఆలోచనలో పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రథ సారధుల పాదయాత్రల నేపధ్యంలో వారి వ్యూహాలకు చెక్ పెట్టే కొత్త చాణిక్యం రూపొందించే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications