కోటి కోసం తెగించింది: పోలీసులకు చిక్కిన 'మరణించిన మహిళ'
కోటి రూపాయల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నటించి ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసేందుకు యత్నించిన ఓ మహిళను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : కోటి రూపాయల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నటించి ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసేందుకు యత్నించిన ఓ మహిళను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కే. శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
చార్మినార్ సమీపంలోని డబీర్ పుర పోలీస్‌లైన్స్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ షకీల్ ఆలం(38)తన భార్య నాజియా షకీల్ (36) పేరుతో 2012లో బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ సంస్థలో రూ.1కోటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు.
ఏడాదికి రూ.11900 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నారు.కాగా ఈ ఏడాది మే 28న తనభార్య నాజియా షకీల్ చాతీనొప్పితో బాధపడుతూ మరణించినట్లు షకీల్ ఆలం జూన్ 23న ఇన్సూరెన్స్ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు.

భార్య చనిపోయిందని...
తన భార్య చనిపోయినట్లు జీహెచ్‌ఎంసీని నమ్మించి డెత్ సర్టిపికెట్‌ను సంపాదించడంతో పాటు డబీర్‌పురాలోని శ్మశానవాటికలో బరియల్ సర్టఫికెట్‌ను కూడా జతపర్చాడు. తనకు భార్య పేరిట ఉన్న పాలసీకి సంబంధించిన బీమా మొత్తాన్ని తనకు మంజూరు చేయాలని కోరారు.

ఇలా బయటపడింది...
నాజియా షకీల్ డెత్ క్లెయిమ్‌ను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ఐసీఐసీఐ అధికారులు నాజియా షకీల్ మృతి చెందినట్లు పేర్కొన్న ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ఆ రోజు చనిపోయిన మాలికాబేగం అనే మహిళకు చెందిన వివరాలను దిద్ది అక్కడ నాజియా పేరు వివరాలను నమోదు చేసినట్లు గుర్తించారు.

మోసం జరిగినట్లు గుర్తించి....
మోసం జరిగినట్లు గుర్తించిన ఇన్సూరెన్స్ అధికారులు ఆస్పత్రిలోని వైద్యులను,జీహెచ్‌ఎంసీ సిబ్బందిని,శ్మశానవాటిక సిబ్బందిని విచారించారు. నాజియా షకీల్ అనే మహిళ మృతదేహాన్ని తాము చూడలేదని చెప్పారు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఇన్సూరెన్స్ మొత్తాన్ని కాజేసేందుకు బతికి ఉన్న భార్యను చనిపోయినట్లు తప్పుడు పత్రాలను తయారు చేసి తమ సంస్థను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ ఏరియా మేనేజర్ సంతోష్ కుమార్ సెప్టెంబర్ 29న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పథకం ప్రకారమే..
ఫిర్యాదు మేరకు సయ్యద్ షకీల్ అలమ్, అతడి భార్యపై ఐపీసీ 420,468,471,406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగానే మరో మూడు సంస్థల వద్ద కూడా రూ. 1కోటి చొప్పున ఇన్సూరెన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ సంస్థను తప్పుదోవ పట్టించుకునేందుకు భార్య నాజియాను మెహదీపట్నంలోని బంధువుల ఇంట్లో ఉంచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు షకీల్ పరారీలో ఉన్నాడు. కాగా, నాజియాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications