
బాసర విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలి.!కేసీఆర్ మరో నీరో చక్రవర్తి.!బండి సంజయ్ ఫైర్.!
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడును ఆలకించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఘాటుగా లేఖ రాసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల న్యాయమైన సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థుల నిరసనలపై నిరోచక్రవర్తి గా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండి పడ్డారు. బాసర ట్రిపుల్ విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలని బండి సంజయ్ ముఖ్యమత్రిని డిమాండ్ చేసారు.

తెలంగాణ ద్రోహులతో సమావేశాలా..
జాతీయ పార్టీ ఏర్పాటుపై, రాజకీయ వ్యూహకర్తలతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి సీఎం చంద్రశేఖర్ రావుకు సమయం ఉంటుంది కానీ గత ఆరు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం సీఎం చంద్రశేఖర్ రావుకు సమయం చిక్కడం లేదా అని బండి సంజయ్ సీఎం చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు. ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్ధుల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికి సీఎం మనసు మాత్రం కరగడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

విద్యార్థుల న్యాయమైన కోరికలు..
మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటనకు, చంద్రశేఖర్ రావు వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మాత్రం ఖజానా ఖాళీగా ఉంటుందా అని బండి సంజయ్ నిలదీసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.
విద్యార్థులతో మైండ్ గేమ్ మానుకోవాలని.. టీ సర్కార్ కు బండి సంజయ్ సూచన
మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలని, పోలీసుల నిర్బందం సమంజసం కాదన్నారు బండి సంజయ్. పవిత్ర సరస్వతి దేవి నిలయమైన బాసర విద్యాలయానికి పోలీసుల పహారా ఎందుకని ప్రశ్నించారు. గోబల్స్‌కు వారసులైన రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీమతి సబితాఇంద్రారెడ్డిగార్లు విదాష్ట్ర్యర్థులతో సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్రప్రభుత్వం దివాళకోరుతనానికి నిదర్శనం బండి సంజయ్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి..
మంత్రులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను అనేక విధలుగా వేధింపులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బాసర ట్రిపుల్ ఐటి సమస్యలపై అన్ని విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రశేఖర్ రావుకు బండి సంజయ్ సూచించారు.