బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి తన్నుకున్నారు: భట్టి విక్రమార్క వార్నింగ్
కరీంనగర్: బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాధ్యత గల ఎమ్మెల్యేలు బజారునపడి తన్నుకోవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా.. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై ఆయన స్పందించార.
ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ప్రభుత్వం ఏం చేయాలో అధి చేస్తుందని బీఆర్ఎస్‌ను భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ప్రతిపక్ష్ హోదా లేకుండా సీఎల్పీ సీటును కూడా గుంజుకున్నారని మండిపడ్డారు. వాళ్ల మాదిరితాము ప్రవర్తించడం లేదన్నారు.

అప్పుడు తనకు రావాల్సిన పీఏసీ ఛైర్మన్ పదవిని ఇతరులకు ఇచ్చారని భట్టి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని తాము కోరుకుంటున్నామని.. అందుకే తాము కేసీఆర్ సభకు రావాలని కోరుతున్నామన్నారు. ప్రతిపక్ష నేతలంటే తమకు గౌరవం ఉందన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో.. ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారన్నారు.
శాంతిభద్రతలు కాపాడటం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అరెకపూడి గాంధీని కాంగ్రెస్ లో చేర్చుకుని పీఏసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతోందంటూ ఆయన విమర్శించారు.
ఇది ఇలావుండగా, పెద్దపల్లి జిల్లా నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్‌లో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు.
ఐదేళ్లలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. లక్ష కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ, 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తమపై విమర్శలు చేస్తారా అంటూ భట్టిప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందుతుందన్నారు.












Click it and Unblock the Notifications