భూపాల్ సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిచ్చేశాడు: తెలంగాణ పురస్కారాన్ని కూడా..
హైదరాబాద్: దేశంలో మతపరమైన రాజకీయాలు పెరిగినందుకు నిరసనగా ఇటీవల అనేక మంది రచయితలు జాతీయస్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం తెలంగాణ రాష్ట్రం నుంచి కొమురం భీం సినిమా హీరో, రచయిత భూపాల్‌రెడ్డి తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
2011లో భూపాల్‌రెడ్డి అకాడమీ నుంచి బాల సాహిత్య పురస్కార్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి తన భావాలను మీడియాతో పంచుకున్నారు దేశంలో మతపరమైన రాజకీయాల ప్రభావం బాగా పెరిగిపోయిందని, ఇది తన మనస్సును గాయపరుస్తున్నదని చెప్పారు.

గత ఏడాదిన్నర కాలంగా దేశంలో జరుగుతున్న సంఘటనలను చూసి విసిగివేసారిపోయానని తెలిపారు. పిల్లలకు దేశంగురించి, మంచి గురించి తెలియజేసేలా పుస్తకాలు రాశానని, అయితే ఆ మంచి నేడు లేదని అన్నారు.
దేశంలో జరుగుతున్న సంఘటనలపట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నదని చెప్పారు. ఇఖ్లాక్ హత్య దేశంలో మానవీయ విలువలు అడుగంటాయనటానికి నిదర్శనమని అన్నారు. రెండుమూడు రోజుల్లో అవార్డును కేంద్ర సాహిత్య అకాడెమీకి కొరియర్ ద్వారా వెనక్కు పంపిస్తానని తెలిపారు.
ఉగాది పురస్కారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు భూపాల్ చెప్పారు. ఉగాది పురస్కరాన్ని అందుకోవడాన్ని పొరపాటుగానే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ముందు తాను విరసం భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు రచయితలు తమక వచ్చిన అకాడమీ అవార్డులను, పురస్కారాలను వెనక్కి ఇచ్చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications