రివైండ్-2017: టీఆర్ఎస్‌కు కోలుకోని దెబ్బ.., తిరగబడ్డ జనం.. ఇవీ వివాదాలు..

Subscribe to Oneindia Telugu
  Big Blow to TRS in 2017 | Oneindia Telugu

  హైదరాబాద్: 2017వ సంవత్సరం చరమాంకానికి వచ్చింది. తెలంగాణ ఏర్పడి మూడున్నరేళ్లు పూర్తయిపోతున్న సందర్భం. బంగారు తెలంగాణ పాలకులను అత్యంతగా కబళించిన సంవత్సరం కూడా ఇదే.

  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మూడేళ్ల పాటు పాలకులు దగదగా మెరిపించినట్లే కనిపించింది. జర్నలిస్టులు,మేదావులు, కవులు.. చాలామంది ప్రభుత్వ పక్షాన చేరిపోవడం వల్ల.. బహుశా ఆ మూడేళ్లలో అసలు సమస్యలే లేవా? అన్నట్లు తయారైంది పరిస్థితి.

  కానీ 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏడాది ఆరంభం నుంచే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. అది మంథని మధుకర్ ఘటన కావచ్చు, నేరెళ్ల కావచ్చు.. బతుకమ్మ చీరలు కావచ్చు.. ప్రజలంతా ప్రభుత్వంపై గట్టిగా తిరగబడ్డారు. మరోవైపు విద్యార్థులు నిరంతరం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.

  మంథని మధుకర్ ఘటన:

  మంథని మధుకర్ ఘటన:

  ఈ ఏడాది తెలంగాణను అత్యంత కుదిపేసిన సంఘటన మంథని మధుకర్ హత్య. కులం కాని అమ్మాయిని ప్రేమించినందుకు అత్యంత కిరాతకంగా హత్య గావించబడ్డ మధుకర్ కేసులో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మనుస్మృతిని తలపించేలా మర్మాంగాలు కోసేసి, ముఖంపై పత్తి మందు చల్లి, మోకాళ్లు విరగ్గొట్టి.. అత్యంత దారుణంగా అతన్ని హత్య చేశారు.

  రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంథనిలో మెరుపు ధర్నా చేశాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత మరోసారి ఉవ్వెత్తున ఈ నిరసన ఎగిసిపడింది. 'మూడెకరాలు ఇస్తానని.. ఆరెకరాలు ఇస్తివా' అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోను జేఎన్‌యూ విద్యార్థులు ఇదే నినాదాన్ని మార్మోగించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ నినాదం చాలా పాపులరైంది.

  ఇంత జరిగినా.. ఇప్పటికీ ఈ కేసులో న్యాయం జరగలేదు. మార్చిలో హత్య జరిగితే.. నేటికీ ఆ కేసులో ఎటువంటి చలనం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు తీర్పును తొక్కి పెట్టారన్న అనుమానాలు లేకపోలేదు.

  మంథని మధుకర్ హత్య తర్వాత.. జమ్మికుంట రాజేశ్, భువనగిరి నరేశ్ లాంటి దళిత యువకులు కూడా కులోన్మాదానికి బలయ్యారు. ఒకవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్న దానిని ఈ ఘటనలు చాటి చెబుతున్నాయి.

  కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం

  నేరెళ్ల దళితులపై దాడి:

  నేరెళ్ల దళితులపై దాడి:

  ఇసుక లారీలు ప్రాణాలు తీస్తుంటే.. ఆగ్రహం చెంది వాటిపై రాళ్లేసినందుకు దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆ లారీలు ప్రభుత్వానికి కావాల్సినవాళ్లవి కావడంతోనే ఇప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

  భూమయ్య అనే ఎరుకుల కులానికి చెందిన వ్యక్తి జులై 2న ఇసుక లారీ ఢీకొట్టి చనిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన దళితులు, అక్కడి బీసీలు లారీలకు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జులై 4న అర్ధరాత్రి వేళ సివిల్‌ డ్రెస్సుల్లో నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాలకు వెళ్లారు. 8 మంది యువకులను బలవంతంగా ఇళ్ల నుంచి లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. 4 రోజుల తరువాత 7వ తేదీన వారిని కోర్టులో హాజరుపరిచి, జైలుకు తీసుకెళ్లగా, బాధితుల ఒంటిపై ఉన్న గాయాలను గమనించిన జైలర్‌ తిరస్కరించారు. అలా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో.. ఈ ఘటన వెలుగుచూసింది.


  రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. అయినా సరే సీఎం కేసీఆర్.. 'లారీలకు నిప్పు పెడితే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా?' అని అసలు సూత్రధారులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. తీరిగ్గా తప్పు తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఈ సంఘటన దురదృష్టకరమని ఓ స్టేట్‌మెంట్‌తో సరిపెట్టారు. ఆఖరికి బాధితులకు సరైన వైద్యం అందలేదు. నేటికీ అసలు నిందితులెవరో తేలలేదు. ఈ సంఘటన టీఆర్ఎస్ ప్రభుత్వంపై దళిత, బీసీ వర్గాల్లో వ్యతిరేకత పెరిగేలా చేసింది.

  నేరెళ్ల ఇసుక కథ: కెసిఆర్ ఎదురు ప్రశ్నే తప్ప....

  బతుకమ్మ చీరలు:

  బతుకమ్మ చీరలు:

  గద్వాల, సిరిసిల్ల నేత చీరలంటూ ఊదరగొట్టి.. చివరాఖరికి ఏమాత్రం నాణ్యత లేని నాసిరకం చీరలను బతుకమ్మ చీరల పేరుతో అంటకట్టడంతో.. తెలంగాణ ఆడబిడ్డలు భగ్గుమన్నారు. సర్కారు చీరలను రోడ్ల పైనే తగలబెట్టి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ముందు చూపు లేని తనం ఈ విషయంలో ఆడబిడ్డల ఆగ్రహానికి కారణమైంది.

  సూరత్, సూలేగావ్ లాంటి ప్రాంతాల నుంచి నాసిరకం చీరలు తెప్పించి.. పండుగ కానుకగా ఇచ్చారు. దీంతో ఆ చీరలపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద వివాదమే రేగింది. నేతలు డబ్బులు నొక్కి నాసిరకం చీరలు కొన్నారని కొందరు.. ప్రభుత్వమే సరైన చీరలను ఆర్డర్ చేయలేదని మరికొందరు.. ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. ఏదేమైనా ఈ దెబ్బతో టీఆర్ఎస్ ప్రతిష్టకు గట్టి దెబ్బే తగిలింది.

  ఒక్క మాటైనా మాట్లాడని కేసీఆర్:

  ఒక్క మాటైనా మాట్లాడని కేసీఆర్:

  కేసీఆర్ అంటే మాటల మాంత్రికుడు అనేది జగమెరిగిన సత్యం. తన వాగ్దాటితో జనాలను మెస్మరైజ్ చేసే స్పీచులు ఇవ్వడంలో ధిట్ట. అలాంటి కేసీఆర్ ఉస్మానియా 100సంవత్సరాల వేడుకల్లో భాగంగా.. క్యాంపస్ లో జరిగిన కార్యక్రమానికి హాజరై.. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అక్కడినుంచి వెనుదిరిగారు.


  తెలంగాణ ఏర్పాటు తర్వాత లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ విషయంలో విఫలమవడంతో విద్యార్థులు అప్పటికే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన క్యాంపస్ లో అడుగుపెట్టింది మొదలు అడుగుడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థి శక్తిని చూసి వెనుకడుగేసిన కేసీఆర్.. అక్కడ మాట్లాడకపోవడమే మంచిదనుకుని మౌనంగా వెనుదిరిగారు. ఆ తర్వాత కొద్దిరోజులకే.. 'ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత.. ఉద్యోగాలకు ఏం తొందర వచ్చింది' అంటూ మరోసారి విద్యార్థుల సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలు కేసీఆర్‌ను నిలువరించడంలో విఫలమయ్యాయి కానీ ఒక్క విద్యార్థి శక్తి మాత్రమే ఆయనను కిమ్మనకుండా చేయగలిగిందనడంలో అతిశయోక్తి లేదు.

  కేసీఆర్ భయపడ్డాడా? 'ఓయూ'లో ఎందుకు మాట్లాడలేదు: ప్రతిపక్షాల కౌంటర్

  టీవీ చర్చతో 'రెడ్ల' వివాదం..

  టీవీ చర్చతో 'రెడ్ల' వివాదం..

  వెల్ కమ్ పేరుతో వెలమ-కమ్మ సామాజిక వర్గాల కలయికకు బాటలు వేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చాలానే ప్రచారం జరిగింది. రెడ్లపై ప్రతికూల అభిప్రాయం కలిగేలా వీ6 టీవి చానెల్లో ఒక ప్రీ-ప్లాన్డ్ డిబేట్ నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అటు రెడ్డి సామాజిక వర్గంలోను టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే సూచనలు కనిపించాయి. ఆ వెంటనే రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ భవన సముదాయంలో రెడ్లను పొగుడుతూ ప్రసంగించారు. అయినప్పటికీ ఆ డిబేట్ ప్రభావం రెడ్లకు టీఆర్ఎస్ పై ప్రతికూల అభిప్రాయం పడేలా చేసింది.

  డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ, టారెత్తిపోయిన దేశపతి?

  మురళి మరణం.. విద్యార్థుల వ్యతిరేకత

  మురళి మరణం.. విద్యార్థుల వ్యతిరేకత

  ఉస్మానియాలో మురళి అనే ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం వల్లే మురళి ఆత్మహత్య అని విద్యార్థులు ఆరోపిస్తుంటే.. ఒత్తిడి తట్టుకోలేకే చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. మురళి ఆత్మహత్యపై ఓయూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం.. వారిపై లాఠీ చార్జీ చేయడం ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చాయి. ఆఖరికి హాస్టల్ గదుల్లోకి దూరి మరీ వారిని చితకబాదిన దృశ్యాలు విద్యార్థి లోకంలో కేసీఆర్ సర్కారుపై మరింత వ్యతిరేకతను పెంచేవిగా మారాయి.

  రణరంగంగా ఉస్మానియా: 'మురళి' ఆత్మహత్యతో మండుతోన్న కొలిమిలా!..

  ఇది కేసీఆర్ సర్కార్ మరో ఫెయిల్యూర్ స్టోరీ: వట్టి ఊదరగొట్టుడేనా?

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  These controversies like Nerella, Batukamma sarees are big blow to TRS in 2017. People expressed their anger and held massive protests against these.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి