హైదరాబాద్ లో మారిన సీన్ ! మజ్లిస్ కంచు కోటల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల ఆధిక్యం..
హైదరాబాద్ అంటే మజ్లిస్ అనే రోజులు పోయాయా ? అధికార పార్టీలతో అంటకాగుతూ ఇన్నాళ్లూ రాజకీయాలు చేస్తూ వస్తున్న హైదరాబాద్ పార్టీ ఎంఐఎంకు ఈసారి ఎన్నికలు షాకివ్వబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్ లోని 7 అసెంబ్లీ సీట్లను దాదాపు రెండు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న మజ్లిస్ కు ఈసారి ఓటర్లు షాకిచ్చేలా కనిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం సిట్టింగ్ స్ధానాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఎంఐఎం సిట్టింగ్ స్దానాలు నాంపల్లి, కార్వాన్, యాకుత్ పురాలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్దులు ఆధిక్యం చాటుకుంటున్నట్లు ఇవాళ వెలువడుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో ఎంఐఎంకు భారీ ఎదురు దెబ్బలు తప్పేలా లేవు. ఈసారి మజ్లిస్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ చేసిన హోంవర్క్ కూడా ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మజ్లిస్ సిట్టింగ్ స్ధానం కార్వాన్ లో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే కౌసర్ మెహియుద్దీన్ వెనుకబడ్డారు. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి అమర్ సింగ్ 9113 ఓట్లు సాధించి 4844 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే యాకుత్ పురాలో తొలిసారి బరిలోకి దిగిన నాంపల్లి ఎమ్మల్యే జాఫర్ హుస్సేన్ వెనుకబడ్డారు. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్ధి వీరంద్ర బాబూ యాదవ్ 8934 ఓట్లు సాధించి 3607 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఇక్కడ ఎంబీటీ అభ్యర్ధి అంజాదుల్లా ఖాన్ కూడా 4757 ఓట్లు సాధించి వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు.
అలాగే ఎంఐఎం మరో సిట్టింగ్ స్ధానం నాంపల్లి నుంచి తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా స్వల్పంగా వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఫిరోజ్ ఖాన్ 6006 ఓట్లు సాధించి 833 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ నాంపల్లి సీటును ఎంఐఎం నుంచి తమ ఖాతాలో వేసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications