వీడియో: ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ: మధ్యలో ప్రకాష్ రాజ్ ఎందుకు..ఎవరి తరఫున?
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టానికి తెర లేచింది. మూడో కూటమి దిశగా సుదీర్ఘ కాలంగా తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ దిశగా ముందడుగు వేశారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఆయన సమావేశం అయ్యారు. దీనికోసం ఆయన ముంబైకి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే- ఉద్ధవ్ థాకరే సహా శివసేనకు చెందిన కీలక నేతలను కలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు.

ప్రకాష్ రాజ్‌పై ఫోకస్..
భోజనానంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమౌతారు. కేసీఆర్ వెంట వెళ్లిన వారిలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, పార్టీ నాయకులు ఉన్నారు. కేసీఆర్ వెంట వెళ్లిన వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉండటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అంతమంది రాజకీయ ఉద్దండుల మధ్య ప్రకాష్ రాజ్ కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో ప్రకాష్ రాజ్ భాగస్వామ్యం ఉండొచ్చనే అభిప్రాయాలకు తావిచ్చినట్టయింది.

పోటీ చేసి ఓటమి..
కర్ణాటకకు చెందిన నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్. బీజేపీ అంటే ఏ మాత్రం ఇష్టపడని నాయకుల్లో ఆయనా ఒకరు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. సోషలిస్ట్ భావజాలం ఉన్న యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్‌గా ప్రకాష్ రాజ్‌కు గుర్తింపు ఉంది. ఇదివరకు బెంగళూరులో గౌరీ లంకేష్ హత్యోదంతం సమయంలోనూ ఆయన నిరసన ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు.
రాజకీయాల్లో ఉన్నా..
సమకాలీన రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. బహుభాషా సినిమాల్లో నటిస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయన సరైన వేదిక దొరకట్లేదనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. అలాగనీ ఇతర పార్టీల్లో చేరడం లేదా సొంతంగా పార్టీని స్థాపించడం చేయలేని పరిస్థితి ఆయనది. ఈ పరిణామాల మధ్య ప్రకాష్ రాజ్- కేసీఆర్ వెంట కనిపించడానికి కారణాలేమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మహారాష్ట్రతో కర్ణాటక కయ్యం..
ప్రస్తుతం మహారాష్ట్ర-కర్ణాటక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. సరిహద్దుల గొడవ ఈ రెండు రాష్ట్రాల మధ్య తరచూ అలజడులకు కారణమౌతోంది. నిరసన ప్రదర్శనలకు దారి తీస్తోంది. మహారాష్ట్రలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల విధ్వంసం వరకూ వెళ్లిందీ పరిస్థితి. విగ్రహాల ధ్వంసంతో ఆరంభమైన ఈ ఘర్షణ పూరక వాతావరణం చివరికి- బంద్ వరకూ వెళ్లింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను నిషేధించే పరిస్థితి కర్ణాటకలో ఏర్పడింది.
Recommended Video
కూటమి ప్రయత్నాల్లో భాగంగా..
ఈ పరిణామాల మధ్య.. కర్ణాటకకే చెందిన ప్రకాష్.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ వ్యవహారం అటు కర్ణాటకలోనూ అనేక చర్చలకు దారి తీసింది. బీజేపీని వ్యతిరేకించే వ్యక్తిగా మాత్రమే ప్రకాష్ రాజ్- కేసీఆర్ వెంట ముంబైకి వెళ్లారనే వాదన వినిపిస్తోంది. మున్ముందు ఆయన టీఆర్ఎస్ తరఫున తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పని చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలకు తెర తీసినట్టయిందీ పరిణామం.












Click it and Unblock the Notifications