ఇంట్లో 54లక్షలు: పెద్ద నోట్ల రద్దుతో మహిళ ఆత్మహత్య
మహబూబాబాద్: జిల్లాలోని శనిగపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రూ. 500, 1000 నోట్లు కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న డబ్బును ఎలా మార్చుకోవాలో తెలియక తీవ్ర మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

నోట్లు చెల్లవనే ఆందోళన
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే. మహబూబాబాద్ జిల్లాలోని శనగపురంలో వినోద(55)అనే వివాహిత గత సంవత్సరం భూమిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఇంట్లోనే దాచుకున్నారు. అయితే పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తమ ఇంట్లో ఉన్న రూ.54లక్షలు చెల్లవని ఆమె ఆందోళన చెందింది.

మనస్తాపంతో ఆత్మహత్య
ఈ నేపథ్యంలోనే వినోద తమ ఇంట్లో దాచిన రూ.54 లక్షలు చెల్లవేమోనన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని భర్త తెలిపాడు. కాగా, వినోదకు నలుగురు కుమార్తెలు. ఓ కుమార్తె వివాహ నిమిత్తం తమకున్న 12ఎకరాలను అమ్మడంతో ఈ భారీ మొత్తం డబ్బు వచ్చినట్లు తెలుస్తోంది.

అవగాహన లోపమే..
ఈ నోట్లను ఏ విధంగా మార్చుకోవాలో సరైన అవగాహన లేక ఆందోళనకు గురైన వినోద.. ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం నోట్ల మార్పిడి విషయంలో స్పష్టమైన ప్రకటనలు జారీ చేసినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాల బాధ్యతే
తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులు మార్చుకుని కొత్త నోట్లను పొందవచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి విషాద ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.












Click it and Unblock the Notifications