స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్!
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోరుకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చేసిన ఘనకార్యం ఏది లేదని, అడుగడుగున కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందుతూ వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డులతో బీఆర్ఎస్ ఉద్యమం
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం పైన బాకీ కార్డును విడుదల చేసి బిగ్ షాక్ ఇచ్చింది. ఒక్కో రైతుకు 75000, మహిళలకు 44000 ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది.

కేటీఆర్, హరీష్ రావు పిలుపు
ఈ క్రమంలోనే గ్రామాలలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీకార్డు పంపిణీ చేసి కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన గ్యారెంటీ కార్డు డ్రామాలను గుర్తు చేయడానికి ఈ బాకీ కార్డును విడుదల చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. స్థానికసంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ బాకీ కార్ద్ మన బ్రహ్మాస్త్రం అని హరీష్ రావు దీనిని ప్రతి ఇంటికి చేర్చాలని, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రభుత్వం బాకీ ఎంతో తెలుసుకోండి
మీకు ఈ ప్రభుత్వం బాకీ ఎంతో తెలుసుకోండి.. ప్రశ్నించండి అంటూ బాకీకార్డు ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ఇది రాష్ట్ర ప్రజలందరి కోసం తాము చేస్తున్న పోరాటం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22నెలల పాలనలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామని చెప్పిన తులం బంగారం బాకీ పడ్డారని, వికలాంగుల పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు 44 వేల రూపాయలు బాకీ పడ్డారని అన్నారు.
కాంగ్రెస్ బాకీలు ఇవే
మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు 55000 బాకీ పడ్డారని కాంగ్రెస్ బాకీ కార్డు లో పేర్కొన్నారు. వృద్ధులకు నెలకు 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు రూ.44000 బాకీ పడ్డారు. రైతుభరోసా 4 ఎకరాల రైతుకు 76 వేల రూపాయలు బాకీ ఉన్నారని, రుణమాఫీ రెండు లక్షల రూపాయలు బాకీ ఉన్నారన్నారు.
గ్రామ గ్రామాన కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ
నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారని, విద్యార్థినులకు స్కూటీ బాకీ ఉన్నారని, విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షల రూపాయల బాకీ ఉన్నారని ఆ బాకీ కార్డులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీసి అడగాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్డులను గ్రామ గ్రామాన పంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు.












Click it and Unblock the Notifications