తెలంగాణలో బీజేపీ బస్సుయాత్ర: వీరి సారథ్యంలోనే, ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులో వేస్తోంది. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేందుకు పలు కార్యక్రమాలను చేపట్టిన బీజేపీ.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు బీజేపీ సిద్ధమైంది.
సెప్టెంబర్ 17న మొదలు పెట్టి అక్టోబర్ 2న ముగించే విధంగా ఈ బస్సు యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి పది జిల్లాలను 3 క్లస్టర్లుగా విభచించి యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఒక బస్సు యాత్ర, గద్వాల నుంచి ఒక బస్సు యాత్ర, భద్రాచలం నుంచి ఒక బస్సు యాత్ర ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది. ఈ మూడు యాత్రలకు రాష్ట్ర పార్టీ కీలక నేతలు సారథ్యం వహించనున్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఒక్కో యాత్రకు నేతృత్వం వహించనున్నారు. ఈ ముగ్గురు నేతల్లో ఎవరూ ఏ క్లస్టర్‌కు నాయకత్వం వహించేది స్పష్టత రావాల్సి ఉంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్క బస్సు యాత్ర ప్రతి రోజూ రెండు అసెంబ్లీ కేంద్రాల్లోకి వెళ్లేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
యాత్రకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంచార్జీ, ఎన్నికల కమిటీ సహా ఇంచార్జీ సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణ బాధ్యత వహించిన వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డి, పాపారావు, విక్రమ్ గౌడ్లకు బస్సు యాత్ర నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టింది.
మూడు క్లస్టర్లలో ప్రారంభమయ్యే యాత్రను దీపక్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై ధ్వజమెత్తుతూనే.. ప్రధాని మోడీ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్ర సహాయంపై ప్రజలకు వివరించనున్నారు. యాత్రలపేరుతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.












Click it and Unblock the Notifications