మునుగోడులో బీజేపీ దూకుడు; ప్రచారానికి జాతీయ నాయకులు; రంగంలోకి బండి సంజయ్!!
మునుగోడు ఉప ఎన్నికల పర్వం నేటితో నామినేషన్లు పూర్తి కానుండటంతో ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి కోసం మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం మంత్రి కేటీఆర్ సైతం రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కోసం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు, జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.

రెండు దశలలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన బీజేపీ
నేటితో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రచార పర్వాన్ని ఉధృతం చెయ్యాలని భావిస్తున్న బిజెపి రెండు దశలలో ప్రచార పర్వాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రేపటినుండి ప్రచారంలో దూకుడు చూపించాలని భావిస్తున్న క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ నేతలు కూడా రంగంలోకి
రేపటి నుండి మొత్తం 11మంది నేతలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తారు. ఇక రెండవదశలో అక్టోబరు 25వ తేదీ నుంచి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగుతారు. ప్రతి మండలంలోనూ రోడ్ షోలు, బహిరంగ సభలతో మునుగోడులో ప్రచారాన్ని మోత మోగించారు అని ప్లాన్ చేస్తున్నారు. ఇక మునుగోడులో ప్రచారం చేసే వారి జాబితాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మురళీధర్ రావు, విజయశాంతి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, బాబు మోహన్ తదితర నేతలు ఉన్నారు.

ప్రచారానికి షెడ్యూల్ ఫిక్స్ చేసిన స్టీరింగ్ కమిటీ
ప్రతి మూడు గ్రామాలకు ఒక యూనిట్ గా గుర్తించి ప్రచార పర్వాన్ని సాగించాలని, అందులోనూ పెద్ద గ్రామంలో ముఖ్యనేతలతో ప్రచారం చేయించి, మిగిలిన గ్రామాలలో ఇతర నేతలతో ప్రచారాన్ని చేయించనున్నారు. ఇక మునుగోడులో బిజెపి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహాన్ని ప్రచార షెడ్యూల్ ను సిద్ధం చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, సమన్వయకర్త గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఈ మేరకు ప్రచారానికి సమాయత్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications