తెలంగాణలో సర్వే సంస్థలకు అందని ఫలితాలు: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు.
హుజూరాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈటల రాజేందర్. గజ్వేల్ లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మేధావులు సహకారం ఇచ్చారన్నారు.

గజ్వేల్ గడ్డపై బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్‌ని ఓడించే శక్తి గజ్వేల్ ప్రజలకు ఉందన్నారు ఈటల రాజేందర్. కురుక్షేత్ర యుద్ధంలో సర్వే సంస్థలకు కూడా అంతుబట్టని ఫలితం గజ్వేల్‌లో వస్తుందన్నారు. గజ్వేల్‌లో గెలుస్తున్నా.. ఎక్కువ మెజార్టీతోనో.. తక్కువతోనో కానీ.. గెలుస్తున్నా అని ఈటల తెలిపారు.
కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలకు ఒక సైకోను ఇచ్చారంటూ కౌశిక్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు ఈటల. కేసీఆర్ తన కొడుకు లాంటి వాడు అని అన్నాడు.. కేసీఆర్ తీరు ఏందో కూడా రేపు బయటపడుతుందన్నారు. బీజేపీకి 25 నుంచి 30 సీట్లు వస్తాయన్నారు. సంకీర్ణ రాజకీయాల్లో ఏమైతదో చూడాలన్నారు. అయితే, బీఆర్ఎస్‌తో మాత్రం కలిసేది లేదని ఈటల తేల్చి చెప్పారు.
బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయన్న కిషన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
మరోవైపు, నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉండేదన్నారు. పోలీసు శాఖ.. కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసిందని.. డబ్బులు పంచుతుంటే పోలీసు శాఖ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications