ఇక బీజేపితో యుద్దమే.!రైతాంగాన్ని అయోమయంలోకి నెడుతున్నారన్న మంత్రి గంగుల కమలాకర్.!
హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. రైతుల అయోమయ స్థితిని, ఆందోళనలను తగ్గించాల్సిన బాధ్యతగల కేంద్ర ప్రభుత్వాన్ని యాసంగి ధాన్యం కొంటారా? లేదా? అని ప్రశ్నిస్తే సమాదానం చెప్పకుండా రైతాంగాన్ని మరింత అయోమయానికి గురిచేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపి నేతలకు వానాకాలం కొనుగోళ్లు చేయాలని దర్నా కార్యక్రమం చేపట్టడం అర్థం లేని చర్య అని మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.

సీఏం కేసీఆర్ రైతు అనుకూల విదానాలు..ఖచ్చితంగా వరి కొంటామన్న మంత్రి గంగుల
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని గతంలోని 6500 కన్నా ఎక్కువగా రాష్ట్రవ్యాప్తంగా 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అధికారం కలెక్టర్లకే ఇచ్చామన్నారు. పంటలు వస్తున్న దానికి అనుగుణంగా రోజూ వారీగా దాదాపు 400 కొత్త కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇప్పటికే 3550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, 72,000 పద్దుల ద్వారా 5,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని వీటి విలువ వెయ్యికోట్లు ఉంటుందన్నారు. గురువారం బీజేపీ జిల్లాల్లో నిర్వహించే దర్నాలపై ద్వజమెత్తారు మంత్రి గంగుల. బీజేపీ నేతలు దర్నా అంటే రైతులకు మద్దతుగా దర్నా చేస్తారనుకున్నాం, కానీ అర్థం పర్థం లేని దర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి గంగుల.

కేంద్రం ఒత్తిడి తేలగలరా.?ధర్నా చేస్తున్న బీజేపి నేతలను ప్రశ్నించిన మంత్రి కమలాకర్
వానాకాలం పంట కొనాలి గాని బీజేపీ దర్నా చేయడం శోచనీయం అన్నారు. వానాకాలం పంట ప్రతీ గింజ కొంటామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం అర్థంకాని దద్దమ్మలు బీజేపీ నేతలన్నారు మంత్రి. కేంద్రం తీసుకుంటామని స్పష్టంగా చెప్పకపోయినా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, చురుగ్గా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 20 నుండి 30 వేల కోట్ల పంటను ముందే వెచ్చించి వానాకాలం పంట కొంటున్నామని తెలిపారు. ఈ వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐ అడిగిన ప్రకారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కిషన్ రెడ్డి కాని, బండి సంజయ్ కానీ ఇతర బీజేపీ నేతలెవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బియ్యం మొత్తం తీసుకునేలా ఒప్పించగలరా అని మంత్రి గంగుల ప్రశ్నించారు.

సీఎం రైతు పక్షపాతి.. ఖచ్చితంగా న్యాయం చేస్తామన్న మంత్రి
పౌరసరఫరాల శాఖ మంత్రిగా పూర్తి బాధ్యతతో వానాకాలం పంట పూర్తిగా కొంటామని గంగుల హామీనిచ్చారు. చేతనైతే బీజేపీ నేతలు, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరైనా సరే రాష్ట్రంలో వానాకాలం కొనుగోళ్లు జరగట్లేదని తమ ద్రుష్టికి తీసుకొస్తే స్వయంగా కొనుగోళ్లు జరిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. కొనుగోళ్లు నిరాకరించిన ఒక్క రైతు పేరు చెప్పగలరా అని సవాల్ విసిరారు మంత్రి గంగుల. కరోనా సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా రెండు మూడు గ్రామాలకు ఒకటి కాకుండా ప్రతీ గ్రామంలో ఉండేవిదంగా గతంలొ 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈసారి మరిన్ని పెంచి 6663 కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రతీ గ్రామాల్లో రెండు కొనుగోళ్లు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసామన్నారు.

గందరగోళం సృష్టించొద్దు.. బీజేపి నేతలకు మంత్రి గంగుల సూచన..
ఇదిలా ఉండగా దర్నావేదిక తెలంగాణ కాదని, ఢిల్లీలో దర్నా చేయాలని మంత్రి గంగుల బీజేపి నేతలకు సూచించారు, వానాకాలం పంట తెలంగాణ సర్కార్ కొంటుందని, యాసంగి ధాన్యం కేంద్రం కొనాలని ఒత్తిడి తెస్తూ దర్నా చేయాలని సూచించారు. యాసంగి పంట కొనలేమని ఈటెల, కిషన్ రెడ్డి చెప్పారని, బండి సంజయ్ దానికి విరుద్దంగా యాసంగిలో రైతుల్ని వరి వేయాలని మాట్లాడుతున్నాడని, ఆపార్టీ నేతల మద్యే ఏకాభిప్రాయం లేదని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలకు రైతులపై ప్రేముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.












Click it and Unblock the Notifications