అన్ని కులాల్లోని పేదలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి: కేసీఆర్ ప్రతిష్ట దిగజారిందన్న ఈటల రాజేందర్
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం పాతాళానికి పడిపోయిందన్నారు హూజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని మండిపడ్డారు.

సొంత పార్టీ నేతలను కొనుగోలు చేసింది కేసీఆర్ ఒక్కరే..
హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు కోసం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయన ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని ఈటల రాజేందర్ అన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం మసకబారిందన్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేసేవాళ్లు ఎవరైనా తమ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినా సీఎం కేసీఆర్ పట్టించుకోరని ఈటల రాజేందర్ విమర్శించారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజాదర్భార్ నిర్వహించేవాళ్లని అన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా ప్రజా దర్బార్ రద్దు చేశారని ధ్వజమెత్తారు.

అన్ని కులాల్లోని పేదలకు రూ. 10 లక్షలివ్వాలన్న ఈటల
తెలంగాణలో వచ్చే ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు గతంలో దళితులపై గుర్తురాని ప్రేమ ఇప్పుడెలా గుర్తొచ్చింది? అని ప్రశ్నించారు. సీఎం సామాజిక వర్గానికి ఎన్ని పదవులు దక్కాయి? వాటిలో దళితులకు ఎన్ని వచ్చాయి? సీఎం కార్యాలయంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అధికారైనా ఉన్నారా? అని ఈటల నిలదీశారు. హైదరాబాద్‌లో భూములు అమ్మితే వచ్చిన డబ్బులు హుజూరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారని అన్నారు. దళితులకు ఇస్తామంటున్న రూ. 10 లక్షలపై జిల్లా కలెక్టర్, బ్యాంకర్ల అజమాయిషీ లేకుండా చూడాలన్నారు. అన్ని కులాల్లో ఉన్న పేదల వర్గాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మిగితా వర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.

తన రాజీనామాతో ప్రజలు మేలే జరిగిందన్న ఈటల..
దళితబంధుకు అవసరమైన లక్షా 70 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఈటల చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గరి వాళ్లు ఎవరు చెప్పినా పట్టించుకోని క్యారెక్టర్ కేసీఆర్ ది అన్నారు. ఇండియా టుడే సర్వేలో ఆయనకిచ్చిన స్థానం చూసైనా పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. తన రాజీనామా వల్ల ఇన్ని ఫలితాలు వస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. హుజురాబాద్ లో మీరు మండల స్థాయిలో కాదు.. ఊరూరికి తిరిగినా.. మీకు డిపాజిట్ కూడా రాదన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వారిని బెదరిస్తున్నారని అన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వస్తే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని ఈటల అన్నారు. ప్రజలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ కాబట్టే ఆ పార్టీలో చేరానని రాజేందర్ తెలిపారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేసి అభాసుపాలు కావొద్దని ఈటెల రాజేందర్ హితవు పలికారు. తన రాజీనామాతో ప్రజలకు మేలే జరిగిందన్నారు.
Recommended Video

త్యాగాలు ఇకవద్దు.. అధికారం కోసం పోరాడతామంటూ బండి సంజయ్
మరోవైపు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శుల చేశారు. బీజేపీ రాస్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర వర్క్‌షాప్ నకు హాజరైన బండి పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో దోపిడీ, నియంత పాలన నడుస్తోందని, కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తున్నారని, జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అధికారమే లక్ష్యంగా పోరడాల్సిన సమయం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లు పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బండుతున్నారని.. ఇంకెన్నాళ్లు ఈ బాధలు.. తెగించి పోరుడుదాం ఉద్యమించి అధికారాన్ని చేజిక్కించుకుందాం అంటూ సంజయ్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications