కవితతోనే కేసీఆర్ పతనం షురూ: బండి పాదయాత్రపై గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, పాదయాత్ర అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
బండి సంజయ్ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, సీఎం మెప్పు పొందేందుకు పాదయాత్రపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నిజాం తరహా నిరంకుశ పాలన సాగిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రజలకు భరోసా కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు పక్కదారి పట్టించేందుకే పాదయాత్ర అడ్డగింత. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయం పట్టుకుంది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన బీజేపీ నేతలు ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి, ఆగస్టు 22న బీజేపీ కార్యకర్తలపై దాడి ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. ఉద్రిక్త వాతావరణానికి తెరలేపిన కేసీఆర్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు లక్ష్మణ్. బండి సంజయ్ పాదయాత్రపై దాడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్రపై విచారణ జరపాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. లక్ష్మణ్‌తోపాటు డీకే అరుణ, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి, రాంచందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.
కవిత నుంచే కేసీఆర్ పతనమంటూ విజయశాంతి ఫైర్
కవిత మీద ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు.
కవిత నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతుందని ఆమె అన్నారు. కవిత మీద ఆరోపణలు వస్తే కేసీఆర్ మాట్లాడటం లేదని విజయశాంతి నిలదీశారు. తెరాస కుటుంబం అవినీతి త్వరలోనే బయటకు వస్తుందన్నారు. సంజయ్ పాదయాత్రను అడ్డుకుని కేసులు పెట్టిన భయపడేదని లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, బండి సంజయ్ అరెస్ట్, యాత్ర అడ్డుకున్నందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి.












Click it and Unblock the Notifications