కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి విజయశాంతి - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు..!!
తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఢిల్లీ..బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం ముమ్మరం అయింది. అందులో భాగంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీ ఎంట్రీ ఖాయమైందని విశ్వసనీయ సమాచారం. అదే బాటలో విజయశాంతి..డీకే అరుణ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు వీరితో చర్చల అంశాన్ని నిర్ధారించారు. షర్మిలతోనూ నేరుగా హైకమాండ్ మాట్లాడుతోంది.
కాంగ్రెస్ ను వీడి బీజేపీ నేతల నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పార్టీలో చేరికల అంశాన్ని నేరుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు.

కాంగ్రెస్..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖరారైందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్ చౌధురి ధ్రువీకరించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.
త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తదితరుల చేరికలు ఉంటాయని, ఆ తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతారని, ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని, అంతా కలిసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ చేరికలు పెరుగుతాయని పేర్కొన్నారు.
వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల తమ పార్టీలో చేరే అంశం అధిష్ఠానం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారని, ఆమె పర్యటనలపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
షర్మిలతో అధిష్ఠానం మాట్లాడుతుందని, ఆమె వల్ల ఏపీలో తమకు ప్రయోజనకంగా ఉంటుందని విశ్లేషించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి, షర్మిల చేరిక వ్యవహారం పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
రాజగోపాల్ రెడ్డి పైన రేవంత్ గతంలో చేసిన ఆరోపణలను ఉప సంహరించుకుంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ గతంలోనే అవసరమైతే ఒక అడుగు వెనక్కు వేస్తానని..పార్టీ వీడిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు బీజేపీలో చేరిక పైన కాంగ్రెస్ నేతలు స్పష్టంగా చెబుతున్న సమయంలో..ఈ నేతల స్పందన కీలకం కానుంది.












Click it and Unblock the Notifications