కేసీఆర్.. బీజేపీ కళ్ళు తెరిస్తే మాడి మసైపోతావ్: ఈటల రాజేందర్ ఫైర్
వరంగల్ వేదికగా బిజెపి నిరుద్యోగ మార్చ్ పేరుతో సమర శంఖం పూరించింది. వరంగల్ లో జరుగుతున్న బిజెపి నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చారని, ఆపై ప్రశ్న పత్రాల లీకేజీ పేరుతో నిరుద్యోగుల బ్రతుకులను ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల బతుకులు బాగుపడలేదని, కెసిఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కెసిఆర్ దోచుకోవడానికే ఉన్నారని, ప్రజల కోసం లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ఫీజు పీకే వరకు ఈ ఉద్యమం ఆగదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రశ్నిస్తున్నందుకు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని కేసులకు బిజెపి భయపడదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఎవడెవడు ఏం చేస్తున్నాడో అన్ని రికార్డులు రాస్తున్నామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పులపై ప్రజల దృష్టి మరలచడం కోసం బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
బిజెపి కళ్ళు తెరిస్తే కెసిఆర్ మాడి మసైపోతారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలన్న ఈటల రాజేందర్, నష్టపోయిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని, వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు హుజూరాబాద్ సబ్ జైల్ లో చెల్పూర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ ను ములాఖత్ ద్వారా కలుసుకొని, పరామర్శించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చెల్పూరు సర్పంచ్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక సైకోలాగా, ఒక శాడిస్టులాగా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ కుక్కలు, కేసీఆర్ చెంచాలు, కేసీఆర్ బానిసలు, సైకోలు చేసే పనులు చూస్తున్నామని మండిపడ్డారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న వ్యక్తులు వారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ప్రశాంతత లేని జీవితం కెసిఆర్ దని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు.












Click it and Unblock the Notifications