బీజేపీలో 'మోత్కుపల్లి' దుమారం-కుండ బద్దలు కొట్టిన సీనియర్ నేత-భయపడేది,బాధపడేది లేదని...
తెలంగాణ బీజేపీలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారం దుమారం రేపుతోంది. పార్టీ లైన్‌ను కాదని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి హాజరుకావడంపై బీజేపీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. కేసీఆర్ ప్రతిపాదించిన దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం అనంతరం మోత్కుపల్లి ప్రశంసలు కురిపించడం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి టీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు,సందేహాలు బీజేపీలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై తాజాగా ఓ టీవీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన మోత్కుపల్లి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

దళిత నాయకుడిగా వెళ్లకపోతే ఎలా...: బండి సంజయ్
'ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి 10 గంటల సమయం కేటాయించి దళితుల సమస్యలపై మాట్లాడలేదు. అంతవరకు ఒప్పుకోవాల్సిందే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో మాట్లాడి అన్నీ ఆయన స్వయంగా నోట్ చేసుకున్నారు.సమావేశానికి స్వయంగా సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే ఒక సీనియర్ నాయకుడిగా,దళిత నాయకుడిగా వెళ్లాను. దళితులకు మంచి జరుగుతుంటే... ఆ సామాజికవర్గానికి చెందిన ప్రతినిధిగా నేను వెళ్లకపోతే ఎలా. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా ఫోన్ చేసి చెప్పాను.ఒకవేళ సమావేశానికి నేను వెళ్లకపోతే దళిత నాయకుడిగా అది నాకు అవమానమే కదా..' అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

దళితులు బీజేపీకి దూరంగా ఉన్నారని...
దళిత సాధికారత పథకానికి సంబంధించి సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఆ సమావేశానికి హాజరవడం ద్వారా బీజేపీ గౌరవాన్ని తాను కాపాడానని చెప్పారు. దళిత కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఇస్తానంటే ఇవ్వొద్దని అనాలా అని ప్రశ్నించారు. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు పెద్దగా సందర్భమే రాదని... వచ్చినప్పుడు వెళ్లకపోతే ఎలా అని అన్నారు. అసలే బీజేపీకి దళితులు దూరంగా ఉన్నారన్న ఒక వాదన ఉందన్నారు. దాన్ని పోగొట్టాలన్నదే తన ఉద్దేశమని... బీజేపీ దళితుల పక్షాన కూడా పోరాడుతుందన్న విషయం చెప్పాలని అన్నారు. పార్టీ నుంచి తనపై ఏ విమర్శ వచ్చిన భయపడేది లేదు... బాధపడేది లేది అని స్పష్టం చేశారు.

ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు...
దళిత సాధికారత పథకం మంచి నిర్ణయమని... చాలా సంతోషమనిపించిందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.సీఎం కేసీఆర్‌పై తన వాయిస్ మారుతోందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. తానేమీ పైరవీకారుడిని కాదని అన్నారు. వ్యాపార లావాదేవీల కోసం రాజకీయాలు చేయట్లేదని తెలిపారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే తాను పార్టీలోకి వచ్చానని... అంతే తప్ప డబ్బులు సంపాదించుకోవడానికి పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అసలు పార్టీలో ఇప్పటివరకూ తనకు ఏ హోదా ఇవ్వలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయినా తానేమీ తొందరపడటం లేదని అన్నారు. ఈటల రాజేందర్ విషయాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పుడు పార్టీలో ఆయనో పెద్ద లీడర్ అని అన్నారు. ఆయనపై చర్చ అవసరం లేదని... అయితే దళితుల భూములు,దేవాలయ భూములు ఉన్నాయని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఆ భూములను వాపస్ ఇవ్వాలని ఆయనతో చెప్పానన్నారు. ఈటల పార్టీ మారడంలో సామాజిక కోణం ఏమీ లేదని... ఆర్థిక వివాదాలతోనే ఆయన పార్టీ వీడారని అన్నారు.

పార్టీలో హాట్ టాపిక్‌గా మోత్కుపల్లి వ్యవహారం...
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆదివారం(జూన్ 27) సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి నర్సింహులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బీజేపీ తరుపున ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆహ్వానించినా ఆయన హాజరవలేదు. సమావేశానికి దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించడంతో రాజాసింగ్ గైర్హాజయ్యారు. అదే సమయంలో పార్టీకే చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తాను బండి సంజయ్‌తో చెప్పే సమావేశానికి వెళ్లానని మోత్కుపల్లి అంటున్నప్పటికీ.. పార్టీ మాత్రం ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి సైతం విమర్శలకు తానేమీ భయపడేది,బాధపడేది లేదని చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications