రాజా సింగ్ బాటలో మరో ఎంపీ?
Dharmapuri Arvind: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో కల్లోలం చెలరేగుతోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శాసన మండలి మాజీ సభ్యుడు రాంచందర్ రావు నియామకం కేంద్ర బిందువుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఆయన నియామకాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తోన్నట్టే కనిపిస్తోంది.
తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యతిరేకత తలెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియమితులయ్యారు. దీనిపై సోమవారమే అధికారిక ప్రకటన వెలువడింది. ఆ వెంటనే ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న గోషా మహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్.. రాజీనామా చేశారు. దీనికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు.
రాజీనామా లేఖను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డికి అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన తనను అడ్డుకున్నారని, అందుకే పార్టీకి గుడ్ బై చెప్పినట్లు వివరించారు. పార్టీకో నమస్కారం అని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు తాజాగా నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్.. తన అసంతృపిని బయటపెట్టుకున్నారు. పార్టీ కర్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నేడు పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాదలచుకోలేదని వెల్లడించారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. భారత్ రాష్ట్ర సమితికి బలమైన నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారాయన. తన నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన పసుపు బోర్డు ఏర్పాటునూ ఇటీవలే సాధించారు.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 1, 2025
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి రేసులో ధర్మపురి అరవింద్ కూడా ఉన్న విషయం తెలిసిందే. రాజా సింగ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ.. వంటి ఫైర్ బ్రాండ్ నేతలకు ఈ పగ్గాలు అందుతాయని మొదటి నుంచీ వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో రాంచందర్ రావుకు పీఠం దక్కడం.. ఈ అసంతృపికి ఆజ్యం పోసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications