జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తాం: 24లో బీజేపీ ముక్త్ భారత్ అంటూ కేసీఆర్
న్యూఢిల్లీ: 2024లో బీజేపీ ముక్త్ భారత్ ఉండాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఆ తరువాత గిరిరాజ్ కళాశాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

మోడీ ఉచితాలు ఇవ్వందంటున్నారన్న కేసీఆర్
మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రైతులకు ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోడీ చెప్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానంటూ కేసీఆర్
బావుల కాడ మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలన్నారు సీఎం కేసీఆర్. 2024లో బీజేపీ ముక్త్ భారత్ ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలన్నారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

మోడీ ఏకైక పని అదేనంటూ కేసీఆర్ విమర్శలు
గత 8 ఏళ్ల పాలనలో మోడీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని ఆరోపించారు. ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోడీ చేస్తున్న ఏకైక పని అని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ గడ్డ మీద నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామన్నారు కేసీఆర్.












Click it and Unblock the Notifications