Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా కలిసిన బండి సంజయ్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. గురువారం ఢిల్లీలో బండి కుటుంబ సమేతంగా వెళ్లి మోడీని కలిశారు. బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత మొదటిసారిగా ఆయన నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ బండి సంజయ్ ను భుజం తట్టి అభినందించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండితో చెప్పారు.
బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కాసేపు మోడీ మాట్లాడారు. ఫొటోలు దిగారు. కాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ ఆగస్ట్ 4న అంటే శుక్రవారం రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యత స్వీకరణ అనంతరం బండి హైదరాబాద్ తిరిగి రానున్నారు. గత నెల వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత నెలలో కాషాయ అధిష్ఠనం బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది.

బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. బండి సంజయ్ ను మొదట కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే మంత్రిగా చేయడానికి బండి సంజయ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కొద్ది కాలం పాటు మంత్రిగా చేయడం తనకు ఇష్టం లేనట్లు బండి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ను బీజేపీ అధిష్ఠనం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

బండి సంజయ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత బండి సంజయ్ తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర బీజేపీలో ఊపు వచ్చింది. పలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఉనికిని చాటుకుంది. బీజేపీ సంజయ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని భావించారు. కానీ సడన్ గా బీజేపీ పెద్దలు అధ్యక్షుడిని మార్చారు.












Click it and Unblock the Notifications