ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష; ఎట్టకేలకు పోలీసుల అనుమతి
ఇందిరా పార్క్ వద్ద బిజెపి తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎట్టకేలకు ఈ రోజు అనుమతి లభించింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ లో బిజెపి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేతలు.ప్రజాస్వామ్య గొంతుకను నులిమేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ధర్నాలు చేయడానికి సీఎం కేసీఆర్ కి అనుమతి ఇస్తారా? టిఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ధర్నాలు చేయొచ్చా? బిజెపి దీక్ష చేస్తే తప్పా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ పోలీసులను నిలదీశారు.

బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణా దీక్షకు పోలీసుల అనుమతి
దీంతో ఎట్టకేలకు ఈ రోజు బీజేపీ నిర్వహించ తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. పోలీసుల అనుమతితో ఈరోజు బిజెపి దీక్ష యధావిధిగా కొనసాగుతుంది. ఉదయం కార్యక్రమం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుందని బిజెపి నాయకులు ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. కావాలని చివరి వరకు అనుమతి ఇవ్వకుండా గందరగోళానికి గురి చేశారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రేమేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కోర్టుకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడడం వల్ల ప్రభుత్వం చివరికి అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ .. కోర్టులోనూ తేలని పంచాయితీ
తెలంగాణా శాసన సభ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టటంపై ఆందోళనకు దిగారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. బిజెపి ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ బిజెపి ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు స్పీకర్ నిర్ణయంపై స్టే విధించడానికి అంగీకరించలేదు.
ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న బీజేపీ దీక్ష
బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ తో మాట్లాడాలి అని ధర్మాసనం సూచించింది. మరోమారు బిజెపి ఎమ్మెల్యేలు కోర్టు సూచనలతో శాసనసభకు తమకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరినా స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ బిజెపి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు దీక్ష చేపడుతున్నట్లు బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద బిజెపి నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications