టార్గెట్ 10 ప్లస్: తెలంగాణ బీజేపీ నేతలకు తేల్చి చెప్పిన అమిత్ షా
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లకుపైగా సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ శ్రేణులకు స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ పర్యటనకు గురువారం వచ్చిన అమిత్ షా (Amit Shah).. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలార్లో ఉన్న శ్లోక కన్వెక్షన్లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని.. ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, తెలంగాణలో 64 లేక 95 సీట్లు రావచ్చని జోస్యం చెప్పారు అమిత్ షా.

గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు. 25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ నాది అనేలా పనిచేయాలన్నారు. ముందుగా సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని డీకే అరుణ ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం చారిత్రక అవసరమనే తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశంలో అందరూ ఆమోదించారు.
భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులచే ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమిత్ షా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో సమావేశమై.. విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. బేధాభిప్రాయాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. అంతా కలిసి పనిచేసి సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయాలన్నారు. సిట్టింగ్ స్థానాల్లో వారే పోటీ చేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications