
తెలంగాణలో బీజేపీ సర్వే... ఎన్ని సీట్లంటే!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోగలమనే అంశంపై భారతీయ జనతాపార్టీ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరిలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు వివరాలను వెల్లడించారు. సర్వే పూర్తయిందని, రెండురోజుల క్రితమే నివేదిక అందిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకుగాను 60 నుంచి 65 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని స్పష్టమైందన్నారు.

ఇతర పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికే..
నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీచేయడానికి బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించిన బీజేపీ అధినాయకత్వం ఇతర పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి, అభ్యర్థులను ఆకర్షించడానికే ఇలాంటి ప్రకటన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని, ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టమంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తథ్యమనే వాతావరణం ఉంది. అయితే బలమైన నాయకులు, కార్యకర్తల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మునుగోడు తరహాలోనే మరికొన్ని ఉప ఎన్నికలు?
మునుగోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో భవిష్యత్తు ఉండదని భావించే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతాపార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని సంజయ్ తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వచ్చేవారికి మాత్రం పార్టీలో స్థానం లేదని తేల్చిచెప్పారు.

మునుగోడు తర్వాత ఉప ఎన్నికలు ఉండకపోవచ్చు
ఎమ్మెల్యే రాజీనామా చేసిన ఆరునెలల్లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మునుగోడు తరహాలోనే మరిన్ని ఉప ఎన్నికలుంటాయని బండి ప్రకటించినప్పటికీ ఆ ఒక్కదానికే ఎన్నిక జరుగుతుందని, సాధారణ ఎన్నికలకు ముందే అదే చివరి ఉప ఎన్నిక కావచ్చని భావిస్తున్నారు. రాజీనామాలు చేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని బండి ప్రకటించినప్పటికీ ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ నుంచి రాజీనామాచేసే వారెవరూ ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.