తెలంగాణలోనూ కూటమి, టార్గెట్ ఫిక్స్ - తాజా నిర్ణయం..!?
ఏపీలో కూటమి తెలంగాణలోనూ కొనసాగనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ సమయంలో జరిగిన చర్చల్లో తెలంగాణలోనూ కూటమి విస్తరణ పైన చంద్రబాబు, పవన్ తో అమిత్ షా చర్చ చేసారు. ఇందుకు సానుకూలత కనిపించింది. దీంతో, మరోసారి ఢిల్లీ వేదికగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
తెలంగాణలోనూ కలుద్దాం
ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా కు సీఎం చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేసా రు. డిప్యూటీ సీఎం పవన్ తో సహా బండి సంజయ్, పురందేశ్వరి పలువురు మంత్రులు ఈ విందు కు హాజరయ్యారు. ఈ సమయంలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా సాయం చేయడం పట్ల అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనకబడిన ప్రాంతాలని, వాటిని అభివృద్ధి పథంలోకి తేవడానికి పోలవరం- బనకచర్ల అంతర్గత నదుల అనుసంధానం ప్రాజెక్టు ఎంతో కీలకమని ఆయనకు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

టార్గెట్ ఫిక్స్
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దీనికి సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఆయనకు వివరించి త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి వారి మధ్య చర్చకు వచ్చింది. తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయడంపై చర్చించారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ జరగనుండటంతో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశం పైన వీరి మధ్య చర్చ కు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూటమి గా కొనసాగితే గెలుపు ఖాయమనే అంచనా వ్యక్తం అయినట్లు సమాచారం. దీంతో, తెలంగాణలో కూటమి కొనసాగింపు పైన ఢిల్లీ వేదికగా త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

డీ లిమిటేషన్ పైనా
ఇదే భేటీలో జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమిలికి ముందుగా మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్ సీట్ల పెంపు.. ఎన్డీఏ సమన్వయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు.. రాజ్యసభ స్థానాల అంశం పైన ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. అదే విధంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను చంద్రబాబు కోరారు. ఆయన తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తి అని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాను దానిపై ఒక లేఖను కూడా ఇచ్చానని పురందేశ్వరి ఆయనకు చెప్పారు. ఇక.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంప్‌లను అమిత్ షా ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications