బీజేపీకి వచ్చే 400 సీట్లలో తెలంగాణ నుంచి ఎన్ని స్థానాలుండాలంటే?
హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని.. కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనే భావనలో దేశ ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా(Social Media) ఇంఛార్జ్‌ల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ కాషాయ పార్టీని తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మోడీ, మోడీ అని యువత నినదిస్తోందన్నారు అమిత్ షా. మళ్లీ మోడీకే పట్టం కడతామని మహిళలంతా అంటున్నారని తెలిపారు. ఈసారి తమకు 400 సీట్లు దాటతాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు అమిత్ షా.

అవినీతిరహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా.. మోడీ పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారని అమిత్ షా కొనియాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. మోడీ మరోసారి ప్రధానిగా వస్తే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని అమిత్ షా గుర్తు చేశారు.
దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించామని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటేనన్నారు. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, గులాబీ పార్టీలు పనిచేస్తాయన్నారు. ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలేనని విమర్శించారు. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. 10 రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని గుర్తు చేశారు. మన సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications