చెట్టుకు వేలాడుతూ ఇద్దరు మహిళల శవాలు: హత్యా, ఆత్మహత్యా?
సంగారెడ్డి: ఉత్తరప్రదేశ్ ఘటనను తలపించే ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ ఆలయ పరిసరాల్లోని గుట్టలో ఇద్దరు మహిళల మృతదేహాలు సోమవారం లభించాయి. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు అందించారు.
ఆలయానికి అతి సమీపంలోని గుట్టల్లో ఇద్దరు మహిళల్లో ఓ మహిళ శవం చెట్టుకు వేలాడుతూ కనిపించగా, సమీపంలో మరో మహిళ శవం పడి ఉంది. రెండో శవం కూడా చెట్టుకు వేలాడుతూ ఉండి ఉంటుందని, శవం కుళ్లిపోవడంతో కింద పడి ఉంటుందని పోలీసులు అంటున్నారు.
గుర్తు తెలియని ఆ ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా, వారిని ఎవరైనా హత్య చేశారా అనేది తేలడం లేదు. సోమవారం గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతుండగా ఈ మృతదేహాలు కనిపించాయి. అతను విషయాన్ని గ్రామ సర్పంచి రజిత దృష్టికి తీసుక వెళ్లాడు. ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, గజ్వేల్ సీఐ సతీష్, జగదేవపూర్ ఎస్సై వీరన్నలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న మహిళల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ ఘటన నెలరోజుల కిందట జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఘటన స్థలంలో రూ.632లు నగదు, నీలి రంగు కొత్త చెప్పులు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరు నీలిరంగు కుర్తా, నలుపు రంగు పైజామా ధరించి ఉండగా, మరో యువతి పసుపు రంగు కుర్తా, ఎరుపు రంగు పైజామా ధరించి ఉంది. మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా తల తెగిపోగా తల కనిపించలేదు.












Click it and Unblock the Notifications