అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదం: ధైర్యంచేసి 50 మందిని కాపాడాడు
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చిక్కుకున్న 50 మందిని ఓ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ సంఘటన మెహిదీపట్నంలో జరిగింది.
హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చిక్కుకున్న 50 మందిని ఓ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ సంఘటన మెహిదీపట్నంలో జరిగింది. అతనిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో అభినందించారు. ఆ కానిస్టేబుల్‌ను అధికారులు సత్కరించారు కూడా.

హుమాయున్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో
హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరోజినిదేవి కంటి దవాఖాన సమీపంలోని ఉస్మాన్ ప్లాజా అనే అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో నాజం అనే వ్యక్తి ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఎలక్ట్రికల్ పరికరాల ఎగుమతి వ్యాపారం చేస్తున్నాడు.

అగ్ని ప్రమాదం
సోమవారం మధ్యాహ్నం ఈ కంపెనీ నుంచి పొగలు వస్తున్నాయి. దీనిని గమనించిన వాచ్‌మన్ అక్కడకు వెళ్లి తలుపు తెరిచాడు. లోపల మంటలు అంటుకుంటుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ముచ్చింతల్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీనికి హుమాయూన్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బందోబస్తులో భీంరావు
ఉస్మాన్ ప్లాజా వద్ద కానిస్టేబుల్ భీంరావు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వారు బయటకు పరుగెత్తుకు వచ్చారు. రెండు, మూడో అంతస్తులో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. వారు బయటకు రాలేకపోయారు.

భీంరావు
భీంరావు వెంటనే తన ప్రాణాలకు తెగించి సుమారు 40 నుంచి 50 మందిని కాపాడారు. చివరలో ఓ వృద్ధుడిని రక్షించడానికి వెళ్లిన క్రమంలో ఆయనకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడినా వృద్ధుడితో పాటు బయటకు వచ్చారు. ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్ కొద్దిసేపు ఇబ్బందికి గురికావడంతో పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే ఆయనకు సపర్యలు చేయించారు.

అరగంటలో మంటలు ఆర్పేశారు
అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు లంగర్‌హౌస్ ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

భీంరావుకు సత్కారం
అగ్ని ప్రమాదంలో తెగువ చూపి ప్రజల ప్రాణాలను కాపాడిన హుమాయూన్ నగర్ కానిస్టేబుల్ భీంరావును తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అభినందించారు. విషయం తెలుసుకున్న భీంరావు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల ఉద్యోగం అంటేనే తెగువ అని, తన పని తాను చేశానని భీంరావు అన్నారు.
కాగా, అతనిని పోలీసు ఉన్నతాధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడారు. భీంరావును చూసి తమ పోలీస్ డిపార్టుమెంట్ గర్విస్తోందన్నారు. అతను ధైర్యసాహసాలు ప్రదర్శించి నలభై, యాభై మందిని కాపాడారని చెప్పారు.












Click it and Unblock the Notifications