ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇద్దరు చంద్రుల వల్లే.. 2024ఎన్నికలలో ఊహించని పరిణామాలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ఏపీలో బి ఆర్ ఎస్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కారణమని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో సభ పెడితే కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ పెడుతున్నాడని ఆయన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కూడా ప్రధాని కావాలనే ఆశతో జాతీయ రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని చింతామోహన్ జోస్యం చెప్పారు.

2024 ఎన్నికలలో జరిగేది ఇదే: చింతా మోహన్
2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చింతామోహన్ తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైకి ఎన్ని చెప్పుకున్నప్పటికీ పతనం ఖాయమని పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉంటారంటూ పేర్కొన్న ఆయన కాపులంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. కాపులు కాంగ్రెస్ పార్టీలో చేరితే, వారికి సీఎంగా అవకాశం ఇస్తామంటూ పేర్కొన్నారు.

ఏపీలో టీడీపీ, వైసీపీ విధానాలతో పేదలు అప్పుల పాలయ్యారు
తను రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగానని, ఎక్కడికి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి ని తిడుతున్నారు అని, తెలుగుదేశం పార్టీ, వైసీపీ విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యారని ప్రజలలో ఆక్రోశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్న అంశాలను ప్రస్తావించిన ఆయన బీజేపీ పతనం ప్రారంభమైంది అంటూ, బిజెపి కోలుకునే అవకాశం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి తాను 18ఏళ్ళ క్రితమే ఊహించాను
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి 18 ఏళ్ల క్రితమే ఊహించానని పేర్కొన్న ఆయన తాను ఆనాడే అధిష్ఠానానికి వివరంగా లేఖ రాశానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని తాను అప్పుడే ఊహించి చెప్పానని పేర్కొన్నారు చింతామోహన్. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే దేశంలో పేదల పరిస్థితి అర్థమవుతుందన్నారు. సంక్రాంతి కానుకగా 1500 విలువచేసే వస్తువులను ఇస్తుంటే వేల మంది తరలి వచ్చారు అని, టోకెన్ ఇచ్చే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోగా ఊహించని ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిని సాకుగా చూపి జీవో విడుదల చేసి జగన్ ప్రభుత్వం సభలను అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చింతామోహన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications