బీఆర్ఎస్‌కే అత్యధిక ఆదాయం: కేసీఆర్ పార్టీకి ఎన్ని వందల కోట్లంటే?
అత్యధిక ఆదాయం పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (BRS) నిలిచింది. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో బీఆర్ఎస్ మొదటిస్థానంలో నిలిచింది.
ఆ సంవత్సరంలో బీఆర్ఎస్‌కు ఏకంగా రూ. 737.67 కోట్ల ఆదాయం వచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానం కావడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ. 333.45 కోట్ల(19.16 శాతం) ఆదాయం వచ్చింది. డీఎంకేకు రూ. 214.35 కోట్ల (12.32 శాతం) ఆదాయం వచ్చింది.

కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 39 పార్టీలు వివరణాత్మక ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్-5 స్థానాల్లో నిలిచిన పార్టీలు రూ.1,541.32 కోట్ల ఆదాయాన్ని పొందాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56 శాతానికి సమానం. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం రూ.1,740.48 కోట్లుగా ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యయాల విషయానికొస్తే, అత్యధికంగా ఖర్చు చేసిన టాప్- 5 పార్టీల లిస్టులో మొదటి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ రూ.181.18 కోట్లు ఖర్చు చేసింది. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ రూ. 79.32 కోట్ల (16.49 శాతం) ఖర్చు చేసింది. మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ రూ. 57.47 కోట్లు (11.94 శాతం) ఖర్చు చేసింది. నాలుగో స్థానంలో నిలిచిన డీఎంకే రూ.52.62 కోట్లు(10.94 శాతం), ఐదో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ రూ.31.41 కోట్లు(6.53 శాతం) ఖర్చు చేసింది.
మరోవైపు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులుపోనూ ఆదాయం మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. బీఆర్ఎస్ పార్టీకి ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలింది. బీజేడీకి రూ.171.06 కోట్లు, డీఎంకేకు రూ.161.72 కోట్ల మేర ఈవిధమైన ఆదాయం లభించింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని వెల్లడించాయి. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు 490.43 శాతం ఎక్కువ ఉన్నాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications