Neelam Madhu: 16వరకు తేల్చేయండి.. బీఆర్ఎస్ అధిష్ఠానానికి నీలం మధు అల్టిమేటం..
పటాన్ చెరు బీఆర్ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. అక్టోబర్ 16లోగా టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకుంటే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. మంగళవారం చిట్కుల్ లో తన అనుచరులతో భేటీ అయ్యారు. పటాన్ చెరు నియోజకవర్గంలో సమస్యలపై ఇంటింటికి తిరిగి తెలుసుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేశాక.. నవరాత్రుల నుంచి తన కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామ బూత్ స్థాయి నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. గడప గడపకు తిరుగుతూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని నీలం మధు పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా మారి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ లో న్యాయం జరగడం లేదని వాపోయారు.

పటాన్ చెరులో 80 శాతం బీసీ ఓటర్లు ఉండగా వారి మద్దతుతో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని నీలం మధు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 మంది అభ్యర్థుల్లో ఒక్క ముదిరాజ్ కు కూడా అవకాశం కల్పించలేదు. దీనిపై రాష్ట్రంలోని ముదిరాజుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 శాతం ఉన్న ముదిరాజ్ లకు ఒక్క సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ మధ్య ముదిరాజ్ సంఘాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు భారీగా ముదిరాజ్ లు తరలొచ్చారు. ఈ సభకు ఈటల రాజేందర్, నీలం మధు కూడా హాజరయ్యారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ముదిరాజ్ లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పటాన్ చెరు టికెట్ సిట్టంగ్ అభ్యర్థి మహిపాల్ రెడ్డికే కేసీఆర్ కేటాయించారు. అయినప్పటికీ నీలం మధు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు.












Click it and Unblock the Notifications