కేటీఆర్ తలకు గాయం- చిరిగిన హరీష్ షర్ట్: అసెంబ్లీ వద్ద రణరంగం: తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న వేళ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలోకి వెళ్లకుండా వారిని ప్రధాన గేటు వద్దే నిలువరించారు. దీంతో అక్కడ భారీ స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా నల్ల టీషర్టులు ధరించి బయలుదేరింది. ఈ దుస్తులపై కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, నెరవేరని ఆరు గ్యారంటీలపై విమర్శనాత్మక నినాదాలు రాసి ఉన్నాయి. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులను గేటు వెలుపలే నిలిపివేశారు.

పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ గేట్ నంబర్ 1 వెలుపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో లక్డీకాపూల్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో గంటల తరబడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రోడ్డుపై బైఠాయించిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేల ఆందోళనలను నిలువరించడానికి పోలీసులు చివరికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. నిరసన తెలుపుతున్న కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ప్రక్రియలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. తల, నుదురు, చేతికి గాయాలయ్యాయి. హరీష్ రావు, మరికొందరు ఎమ్మెల్యేల షర్ట్ చిరిగిపోయింది.
ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీలు బ్లాక్ టీషర్ట్ ధరించి తిరగవచ్చని, అలాంటప్పుడు తెలంగాణ శాసనసభలోకి తాము అవే టీషర్టులతో రాకుండా అడ్డుకోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
మరోవంక.. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆందోళన బాట పట్టారు. 22ఏపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. భూ దందాలపై విచారణ జరిపించాలని పట్టుబట్టారు. నిరసనలకు దిగారు. వారి నిరసనతో స్పీకర్ సభను కొంంత సమయం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
#WATCH | Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao, MLA Harish Rao, and others were detained by the police outside the Telangana State Assembly police while protesting against the state government.
— ANI (@ANI) September 7, 2026
They had come to attend the Assembly session wearing black… pic.twitter.com/tafyzJVweF













Click it and Unblock the Notifications
