హైదరాబాద్ కు జలగండం.. పాతాళానికి భూగర్భ జలాలు!
హైదరాబాద్ కు తీవ్ర సంక్షోభం రాబోతోంది. భవిష్యత్ ఇప్పటినుండే ఆందోళన కలిగిస్తోంది భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు పడలేదు. అయితే ఈసారి వర్షాలలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, గత సంవత్సరం నమోదైన భారీ లోటును పూడ్చే స్థాయికి వర్షాలు పడలేదు. భూగర్భ జలాల శాఖ తాజా గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో నగరంలో సగటు నీటిమట్టం 11.20 మీటర్ల లోతులో నమోదైంది.
ఐదు మీటర్లు లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు
గతేడాది ఇదే సమయంలో ఇది 6.36 మీటర్లుగా ఉండేది. కేవలం ఏడాది వ్యవధిలోనే సగటు నీటి మట్టం దాదాపు ఐదు మీటర్లు లోతుకు పడిపోయింది. నగరంలోని ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాలు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణ శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కుత్బుల్లాపూర్‌లో ఆగస్టు నెలలో నీటిమట్టం 39.89 మీటర్ల లోతుకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో 14.15 మీటర్లుగా ఉండగా, ఏకంగా 27.74 మీటర్ల తేడా కనిపించింది.

హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లోనూ గణనీయమైన భూగర్భ జలాల తగ్గుదల
తిరుమలగిరిలో 13.73 మీటర్ల పతనంతో 17.68 మీటర్లకు, మారేడ్‌పల్లిలో 12.97 మీటర్లు పడిపోయాయి. శేరిలింగంపల్లి, మేడిపల్లి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లి, హఫీజ్‌పేట్ వంటి ప్రాంతాల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం లోటు వర్షపాతం. ఆగస్టు వరకు హైదరాబాద్‌కు సాధారణంగా 460 మిల్లీమీటర్ల వర్షం రావాల్సి ఉండగా, కేవలం 360 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 22 శాతం లోటు ఏర్పడింది.
భూగర్భ జలాల పునరుద్ధరణకు అడ్డంకి వీటి వల్లే
పర్యవేక్షణలో ఉన్న 46 మండలాల్లో 28 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవగా, 17 మండలాల్లో సాధారణ స్థాయి, ఒక్క మొయినాబాద్‌లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది.
వర్షం తక్కువగా పడటమే కాకుండా, కురిసిన వర్షపు నీటిని సమర్థంగా భూగర్భంలోకి పంపే రీచార్జ్ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం కూడా సమస్యను తీవ్రతరం చేస్తోంది. పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, తగ్గుతున్న సహజ నీటి నిల్వ ప్రాంతాలు భూగర్భ జలాల పునరుద్ధరణకు అడ్డంకిగా మారుతున్నాయి.
అన్ని మండలాలలో దారుణంగా నీటి నిల్వలు.. ఆందోళనకరం
మే నెలతో పోలిస్తే ఆగస్టులో సగటున 0.80 మీటర్ల మెరుగుదల నమోదైంది. 2016-2025 దశాబ్ద సగటుతో పోల్చితే 14 మండలాల్లో నీటిమట్టాలు మెరుగ్గా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పెరుగుదల 17 మీటర్ల వరకు ఉంది. అయినప్పటికీ 11 మండలాల్లో నీటిమట్టం ఇంకా 20 మీటర్లకు మించి లోతులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు వర్షపు నీటి రీచార్జ్‌పై మరింత దృష్టి సారించాలని, సహజ నీటి నిల్వ ప్రాంతాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications
