తుక్కుగూడ నర్సు అత్యాచారం,హత్యపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!!
హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై జరిగిన ఘోరమైన అత్యాచారం, హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మహిళా ఉద్యోగుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవెనెత్తిన ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది.బాధితురాలి కుటుంబానికి త్వరితగతిన పూర్తిస్థాయి న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఆసుపత్రి ఆవరణలోనే ఈ ఘోరం జరగడం పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.బాధితురాలు నివసించిన వసతి గృహ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి,ఈ దారుణంలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు.ముఖ్యంగా మహిళా సిబ్బంది రక్షణ కోసం చట్టబద్ధంగా అమలు చేయాల్సిన భద్రతా నిబంధనలను పాటించడంలో జరిగిన నిర్లక్ష్యంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని కోరారు.

సమగ్ర విచారణ - ఫాస్ట్ ట్రాక్ కోర్టు
నర్సుపై అత్యచార ఘటనకు దారితీసిన అన్ని పరిణామాలపై లోతైన మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ రాక్షసత్వానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నప్పటికీ, కేసు విచారణలో ఎక్కడా ఎటువంటి సాచివేత ధోరణి ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దర్యాప్తును అత్యంత నిశితంగా,శాస్త్రీయ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లాలన్నారు.బలంగా ఉన్న ఫోరెన్సిక్ ఆధారాలు,సాంకేతిక సాక్ష్యాలను త్వరితగతిన సేకరించి,వీలైనంత త్వరగా న్యాయస్థానంలో పటిష్టమైన చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు.
బాధితురాలి కుటుంబానికి అండగా ప్రభుత్వం
విచారణలో ఎలాంటి ఆలస్యం జరగకుండా లా,పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.మరోవైపు,బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీతక్క బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించగా,ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంతో పాటు 'ఇందిరమ్మ'ఇల్లును కూడా మంజూరు చేశారు.
పరిపాలనా వ్యవస్థలో మళ్లీ ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం నిందితుడికి శిక్ష పడేలా చేయడమే కాకుండా, సేవల రంగంలో పనిచేసే ప్రతి ఒక్క మహిళకు పూర్తి భద్రత కల్పించే సరికొత్త మార్గదర్శకాలను తేవాలని సూచించారు. ఆడబిడ్డలను వేధించే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించేందుకు వీలుగా భవిష్యత్తులో గట్టి చర్యలు తీసుకోనున్నారు.














Click it and Unblock the Notifications
