సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం కలిశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
నూతన రోడ్ల నిర్మాణం, మరుగునీటి వ్యవస్థ, తాగునీటి నూతన పైప్‌లైన్ల నిర్మాణం, తదితర పనులకు సుమారు 25-30 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని కోరారు. దీంతోపాటు కూకట్‌పల్లి మండలం పరిధిలోని హైదర్‌నగర్ గ్రామం సర్వే నెంబర్ 145, 163లలో నిర్మాణ అనుమతులను నిలిపివేసి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. దశాబ్దాల కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ప్రభుత్వపరమైన అన్ని అనుమతులను జారీ చేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

ఇటీవల కాలంలో ఆకస్మాత్తుగా నిర్మాణ అనుమతులను నిలిపివేశారని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అదేవిధంగా జేఎన్టీయూ వెనుక ఉన్న సాయినగర్ కాలనీ వాసుల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మాధవరం విజ్ఢప్తి చేశారు.
అన్ని విషయాలను వివరంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపిస్తానని, వీటన్నింటికీత్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మాధవరంకు హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే.
అయితే, పది మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిస్తే పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారడం లేదని, తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం, నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రిని కలిశామని వివరణ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications