సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ప్రకాశ్ గౌడ్.. రేవంత్ రెడ్డికి శాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు ప్రకాశ్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భూసమస్యలు పరిష్కరించాలని, నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.

కాగా, ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిన ప్రముఖులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పలువురు సినీ ప్రముఖులు కలిశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ, తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications