Cockfighting Racket: కోడి పందాల నిర్వహణ కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
Cockfighting Racket: హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడి పందాల నిర్వహణ కేసు రాజకీయ మలుపు తీసుకుంది. ఈ కోడిపందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ పోలీసులు మాదాపూర్ లోని ఎమ్మెల్సీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. కోడి పందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ యజమానిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆ ఫామ్ హౌస్ ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఈ కేసులో పోచంపల్లిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు.
మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలోని సర్వే నంబర్ 165లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో మంగళవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి 61 మందిని అరెస్ట్ చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడికత్తులు, రూ. కోటి విలువైన క్యాసినో నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే ఉండడం గమనార్హం.

ఈ వ్యవహారంలో అరెస్టయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారని.. మిగిలిన వారు ఏపీకి చెందిన వారని తెలుస్తోంది. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని కొందరు పరారయ్యారని.. వారు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గురించి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఫామ్‌హౌస్‌లో దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికీ గుర్తించబడలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications