బీఆర్ఎస్‌కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కే కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమైంది. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మార్చి 30న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గద్వాల విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఎంపీ కే కేశవరావు కూడా పార్టీ మార్పుపై స్పందించారు.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నానని.. గతంలో సుదీర్ఘ కాలం ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు కేశవరావు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని.. తనకు కూడా ఆయన అంటే గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా తనకు బాగా సహకరించారన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని.. 84 ఏళ్ల వయస్సులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కేకే నిర్ణయంపై కేసీఆర్ ఆగ్రహం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన ఫాంహౌస్‌లో గురువారం కే కేశవరావు సమావేశమయ్యారు. పార్టీ అంశాలు, కవిత అరెస్టుపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. కవితను అక్రమంగా అరెస్టు చేశారని కేశవరావు వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంలో కేసీఆర్ కొంత అసహనానికి గురైనట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కేశవరావు అక్కడ్నుంచి వెళ్లిపోయారని సమాచారం.
కేకే కుమారుడి మాట ఇది
అయితే, తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు. తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తమ నాయకుడు కేసీఆర్ అని విప్లవ్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉందన్నారు. ఈ మేరకు కే కేశవరావు, గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో విప్లవ్ కుమార్ స్పష్టతనిచ్చారు.












Click it and Unblock the Notifications