రైతుబంధును అడ్డుకుంది కాంగ్రెస్ కాదు: కే కేశవరావు సంచలనం (వీడియో)
హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నిధుల పంపిణీకి తొలుత అనుమతి ఇచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా ఆపివేసేలా ఉత్తర్వులు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రైతుబంధును పొందుతున్న లబ్ధిదారుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కూడా ఉన్నారని.. అది ఆగిపోతే వారు కూడా నష్టపోతారు కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు నిధులు ఆగిపోయాయని, తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. అయితే, తాజాగా, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు కూడా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు మద్దతిస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రైతుబంధు ఆగిపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని కే కేశవరావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వల్లనే ఆగిపోయిందని తాను అనడం లేదని అన్నారు. సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన తర్వాత కేశవరావు పై వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిపోయిందంటూ కాంగ్రెస్ పేర్కొంది.

కాగా, అంతకుముందు, కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధును నిలిపివేయాలని సోమవారం ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ని ఎంపీ కే కేశవరావు వెళ్లి కలిశారు. రైతుబంధుకు అనుమతి ఉపసంహరించుకోవడంపై వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీకి వివరణ ఇచ్చారు. రైతుబంధును అడ్డుకోవడం సరికాదన్నారు.
కాంగ్రెస్ రైతు బంధును ఆపలేదు.
— Telangana Congress (@INCTelangana) November 27, 2023
హరీశ్ రావు వల్లే ఆగింది.
- బీఆర్ఎస్ నేత కేశవ రావు గారు.#ByeByeKCR #MaarpuKavaliCongressRavali pic.twitter.com/VWfi6kMTeb
రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. మంత్రి హరీష్‌రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ సోమవారం రైతుబంధు నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశంతో మంగళవారం విడుదల అవ్వాల్సిన రైతుబంధు నిధులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో కేశవరావు ఈసీని కలవడం కాస్త ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications