బీఆర్ఎస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి !
బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ కీలక నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ హఠాన్మరణం చెందడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈరోజు ( మే 27, 2025 ) ఉదయం ఆయనకు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలరు. దీంతో వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. మదన్‌లాల్ మృతితో వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుటుంబ నేపథ్యం..
మదన్‌లాల్‌కు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్, కుమార్తె మనీషా లక్ష్మి ఉన్నారు. కుమారుడు మృగేందర్ లాల్ ప్రస్తుతం తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, అలాగే కోడలు కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం.

రాజకీయ ప్రస్థానం..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు మదన్‌లాల్. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. 2014లో వైరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్‌ఎస్ లోకి చేరారు. ఆ తర్వాత 2018, 2023లో బీఆర్‌ఎస్ తరఫున వైరా నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇంచార్జ్ గా సేవలందిస్తున్నారు.
మదన్ లాల్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలానే పలువురు సీనియర్ రాజకీయ నాయకులు సైతం, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇక ఈరోజు సాయంత్రం మదన్‌లాల్ మృతదేహాన్ని వైరాకు తరలించనున్నారు. బుధవారం ఆయన స్వగ్రామమైన ఈర్లపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications