కవితకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి సస్పెండ్..?
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలపై విమర్శలు చేసినందుకు, పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడినందుకు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తాజాగా కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆ తర్వాత తనపై సోషల్ మీడియాలో జరిగిన దాడిపై స్పందిస్తూ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి.బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. తాను తన తండ్రికి ఎన్నిసార్లైనా లేఖలు రాస్తానని అడగడానికి మీరెవరు? అంటూ కేటీఆర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు.

తన లేఖను ఎవరు లీక్ చేశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.తనకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని స్పష్టం చేస్తూ, పార్టీలో తన స్థానాన్ని పునరుద్ఘాటించారు. జైలుకు వెళ్లిన నాటి నుండి తనపై కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు.తనపై తప్పుడు వార్తలు వస్తే బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తనపై టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కవిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని భావిస్తూ ఈ చర్యకు సిద్ధమవుతున్నారు.మరోవైపు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తే, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆమె పార్టీలోనే ఉంటూ తన వాదనను వినిపిస్తారా, లేక పార్టీని వీడి కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారా అనేది వేచి చూడాలి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications