గవర్నర్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్!!
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళి సై తిరస్కరించడంపై బిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేసిన కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లకు రాజకీయ నేపథ్యం ఉందని తిరస్కరించడం పై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరును తప్పుపడుతూ మంత్రులు, ఎమ్మెల్సీ కవిత అనేక వ్యాఖ్యలు చేశారు.
వెనుకబడిన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యన్నారాయణ అనేక దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే గవర్నర్ తిరస్కరించడం దారుణమని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వెనుకబడిన వర్గాలను అవమానించడమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తమిళి సై నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్ తీరును తప్పు పట్టారు.

ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, గవర్నర్ తీరు బాధాకరంగా ఉందని ఎమ్మెల్సీ కవిత గవర్నర్ ను టార్గెట్ చేశారు. ఇక బి ఆర్ ఎస్ పార్టీ నేతలు గవర్నర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న క్రమంలో తమిళి సై సరైన పని చేశారని బిజెపి నేతలు తమిళి సై చర్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.
గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని బండి సంజయ్ మండిపడ్డారు. ఆమె తన అధికారాలు ఉపయోగించి తప్పులను తప్పు అంటే రాజకీయాలు ఆపాదిస్తున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవినీతిమయమైన బిల్లులకు ఆమోదం తెలిపితే గవర్నర్ మంచివారని, అలా చెయ్యకపోతే ఆమె చెడ్డవారని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. రబ్బర్ స్టాంపు లా గవర్నర్ తమిళి సై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications