ఆరు నూరైనా.. ఓడేది కారు.. హస్తం గెలుపు ఖరారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు పదునైన వాగ్బాణాలను సంధిస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఒక పార్టీపై మరొక పార్టీ మండి పడుతోంది. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
ఆరు వారాలు...ఆరు హామీలు... ఆరు నూరైనా...ఓడేది కారు... హస్తం గెలుపు ఖరారు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఆరువారాల సమయం ఉందని, ప్రజా సంక్షేమం కోసం తాము ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ఈ పోస్టు ద్వారా స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, ఆరు నూరైనా బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని, కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు అవుతుందంటూ పోస్ట్ పెట్టారు.

అంతకుముందు కల్వకుంట్ల #SCAMILY కి కౌంట్ డౌన్ అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. మోసపోయిన దళితుడు, రక్షణ లేని ఆడకూతురు చెప్తున్న కౌంట్ డౌన్.. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్ అంటూ కెసిఆర్ ఫ్యామిలీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్.. నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం అంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను పట్టి పీడిస్తున్న రావణాసురుడి నుండి విముక్తి కలిగించడానికి ప్రజలంతా కార్యోన్ముఖులై ముందుకు రావాలన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కెసిఆర్ సర్కార్ ని గద్దె దించడానికి ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications