వచ్చే కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదిలాబాద్: రైతుబంధు కావాలా.. రాబంధు కావాలా ఒక్కసారి ఆలోచించుకోండని
ప్రజలకు సూచించారు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంది మాట విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాలు పాలవుతారని.. అందుకే నిజానిజాలు గమనించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇంకా పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో కూడా ఒకసారి చూడాలని కోరారు కేసీఆర్.
ఇక, కేంద్రంలో వచ్చేది.. ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. 2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్(BRS) కీలకం కానుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి నేటి వరకు చైతన్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఆదిలాబాద్ అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా పరిణతి రాలేదని ఆవేదన చెందారు. ఎన్నికలనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నియోజకవర్గం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని సూచించారు.

బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల బాగు కోసమన్నారు కేసీఆర్. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా.. రాబంధు కావాలా.. ఒక్కసారి ఆలోచించండి. జోగురామన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నాతో కొట్లాడి ఆదిలాబాద్‌కు జోగురామన్న ఇంజినీరింగ్ కాలేజీ తెచ్చుకున్నారు. మైనార్టీలను ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గానే కాంగ్రెస్ చూసింది' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాకముందు చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి అన్నింటినీ అధిగమించి సంక్షేమంతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. అందుకే రైతుబంధు ఉండాలంటే బీఆర్‌ఎస్ ఖచ్చితంగా గెలవాలన్నారు. 24 గంటల కరెంటు వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే అంటున్నారని మండిపడ్డారు.
కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు కేసీఆర్. ఇక, తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకు ఎందుకు ఓటేయాని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications