బీఆర్ఎస్ జెడ్పీటీసీ దారుణ హత్య.. మాటువేసి గొడ్డళ్ళు, కత్తులతో దాడి చేసిన అగంతకులు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు శెట్టి మల్లేశం ఈరోజు తెల్లవారుజామున వాకింగ్ కోసం బయటికి వెళ్లిన క్రమంలో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వాకింగ్ కి వెళ్ళిన జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం పై అగంతకులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. ఊహించని పరిణామానికి షాక్ కు గురైన మల్లేశం తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చెయ్యటంతో తీవ్ర గాయాలపాలైన మల్లేశం రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో పడిపోయారు.
స్థానికులు అది గమనించి వెంటనే మల్లేశంను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన రక్తపు మడుగులో ఉన్న మల్లేశంను మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రి వైద్యులు అప్పటికే మల్లేశం మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఇక ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పిటిసి మల్లేశం దారుణ హత్య నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల ను రంగంలోకి దింపి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులను అడిగి సంఘటన గురించి వివరాలను సేకరించారు. అసలు మల్లేశం ను హతమార్చిన వారు ఎవరు? మల్లేశం ను మాటువేసి మరి హతమార్చిన ఈ సంఘటన వెనుక కారణాలు ఏమిటి? వంటి వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో మల్లేష్ ఎవరెవరితో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీల సమస్యలు ఉన్నాయా? అనేవి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక జెడ్పీటీసీ సభ్యుడు హత్యతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications